పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా ప్రజల వద్దకు యాత్రల రూపంలో వెళుతున్నారా… లేదా, షూటింగ్ కోసం సెట్ కు, లోకేషన్ కు వెళుతున్నారా? ఆయన ప్రస్తుతం సమయం ఎలా గడుపుతున్నారు… ఆ రెండింటిలో ఏ పనిలో బిజీగా ఉన్నారు.. అనే సంగతిని.. జస్ట్ ఆయన ఫోటో చేస్తూ యిట్టే చెప్పేయొచ్చు. పవన్ కల్యాణ్ గడ్డం నున్నగా షేవ్ చేసుకుని ఉంటే గనుక.. ఆయన షూటింగ్ లో ఉన్నారని అర్థం! చిరుగడ్డంతో తిరుగుతూ ఉంటే.. జనంలో ఉన్నారని అర్థం. గడ్డం బోలెడంత పెరిగిపోయి ఉంటే.. షూటింగ్ షెడ్యూలులో గ్యాప్ వచ్చిందని అర్థం!
అవును పవన్ కల్యాణ్ విషయంలో ‘గడ్డం ఇండెక్స్’ రాజకీయాలు నడుస్తున్నాయి. సాధారణంగా సినిమా హీరోలు గడ్డం గొరిగే విషయంలో ఒక జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. షూటింగులు లేని రోజుల్లో గడ్డం షేవ్ చేయరు. ప్రతిరోజూ షేవ్ చేయడం వల్ల.. చర్మం మొద్దుబారిపోయి, లేతదనం పోతుందని వారికి భయం. అందుకే షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్ గా షేవ్ చేసుకుంటూ అందంగా కనిపించే ప్రయత్నం చేస్తారు. అందమే పెట్టుబడిగా, దాన్ని ప్రదర్శించడమే బతుకుతెరువుగా గడిపేవాళ్లు గనుక.. వాళ్లకు అది తప్పదు.
పవన్ కల్యాణ్.. ఇవాళ్టి నుంచి అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటించే టూరు ప్రోగ్రాం పెట్టుకున్నారు. సహజంగానే.. రాజధాని తరలింపు ప్రయత్నాలపై ముమ్మరంగా విమర్శలు కురుస్తాయి. పవన్ కల్యాణ్ సహజంగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, కమిట్ మెంట్ ఉన్న నాయకుడిగా కనిపిస్తారు. కానీ వాటి పరిష్కారం కోసం ఆయన ఎంచుకుంటున్న విధానాలే తేడా కొడుతుంటాయి. జగన్ చేతికి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పును ఆమోదించడంలో ఆయనకు అడ్డు వచ్చే ఈగోలు.. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యే నాయకుడిగా ముద్ర వేయిస్తే అందులో ఎవరినీ తప్పుబట్టక్కర్లేదు.
అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి అయినా సరే.. తాను గుర్తించిన ప్రజా సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావాలనే దిశగా.. గత అయిదేళ్లలో పవన్ కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ.. అదే క్రమంలో జగన్మోహన రెడ్డిని కలవగలరా? అలా.. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అలా కూడా జరిగేట్లయితే.. పవన్ ఎజెండాలో ఉండే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతూ వస్తాయి. కానీ.. వ్యక్తిగత అహాలు, ప్రజాప్రయోజనాలపై ఎంత శ్రద్ధ ఉన్నప్పటికీ.. వాటిని అధిగమించే రాజకీయ ప్రయోజనాలు ఇవాళ్టి రాజకీయాలను శాసించినంత కాలం అలాంటి పరిణామాలను ఊహించలేం.
.

Discussion about this post