పవన్ కల్యాణ్ మీద ప్రజలకు కొన్ని ఆశలున్నట్లే.. ఆయనను నమ్ముకున్న పార్టీ నాయకులకు కూడా అంతకు మించిన ఆశలున్నాయి. పవన్ కల్యాణ్ కూడా తనలో పోరాట పటిమ ఉన్నదని.. దాన్ని మరింత కాలం కొనసాగించగలనని, జగన్ ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా పనిచేయగలనని కొన్ని కొన్ని సంకేతాలు ఇస్తూనే వచ్చారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో.. తాము మాట్లాడుతున్న మాటలకు ప్రజల మద్దతు ఉన్నదని నిరూపించుకోగలిగే ఏకైక అవకాశం ఎన్నికలు. అలాంటి ఎన్నికల పర్వం నుంచి పక్కకు తప్పుకుంటూ పవన్ తీసుకున్న నిర్ణయం పలాయనం తప్ప మరొకటి కాదు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీచేయకూడదని జనసేన నిర్ణయం తీసుకుంది. ఇది చాలా విపరీతమైన నిర్ణయం. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో పవన్ కల్యాణ్ చెప్పలేదు. కానీ.. ఆ నిర్ణయం ద్వారా.. ఆయన తన అభిమానులను, పార్టీ కార్యకర్తలను నిరాశపరిచారు అన్నది మాత్రం వాస్తవం.
స్థానిక సంస్థల్లో పంచాయతీల ఎన్నికలకు, మునిసిపల్ ఎన్నికలకు చిన్న తేడా ఉంటుంది. మునిసిపాలిటీల్లో ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా ఉంటారనే అభిప్రాయం ఒకటుంది. అంటే.. ప్రభుత్వ పాలన సక్రమంగా లేకపోతే గనుక.. మునిసిపాలిటీల్లో ఆ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. పైగా.. కొత్తతరం రాజకీయాలను సృజిస్తానని అంటూఉండే పవన్ కల్యాణ్ వాదనలకు కూడా.. మునిసిపాలిటీల్లోనే ఆదరణ ఎక్కువగా ఉంటుంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా పరాభవం పాలైనప్పటికీ.. స్వయంగా తాను కూడా రెండు సీట్లలోనూ ఓడిపోయినప్పటికీ.. పవన్ కల్యాణ్ తెలంగాణలో తన ప్రాభవాన్ని నిరూపించుకోడానికి మునిసిపల్ ఎన్నికలను అవకాశంగా వాడుకోవాల్సింది. కానీ… ఆయన ఆ పనిచేయలేదు. ఎన్నికల బరినుంచి పలాయనమంత్రం పఠించారు.
జనసేన పార్టీ నిర్వహణలో పవన్ కల్యాణ్ చేసిన చారిత్రక తప్పిదం ఇది అవుతుంది. ప్రజలు తీర్పు చెప్పే సమయంలో మొహం చాటేసి.. ఆ తర్వాత.. పవన్, జగన్ కు వ్యతిరేకంగా ఎన్ని రంకెలు వేసినప్పటికీ.. ఇక సాధించేది ఏమీ ఉండదు.
.