జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీ విషయంలో తన నిర్ణయం పున:సమీక్షించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే పేరుతో రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ నాయకత్వం నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో చెప్పడం రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం కలుగజేస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
పవన్ తన ప్రసంగంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కానీ… విభజన హామీల అమలు గురించి కానీ మాటమాత్రం ప్రస్తావన చేయక పోవడం బాధాకరమన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్‌ను రాష్ట్రంలో అమలుకు పూనుకోవడం బీజేపీకి ఉపయోగపడుతుంది తప్ప.. వైసీపీ విధానాలను తిప్పికొట్టేందుకు ఉపయోగపడదన్నారు.
వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసే భారాలు… అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ తరగతుల ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు తమ తమ పద్దతుల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీలు అమలుపై ద్రోహం చేయడమే కాకుండా.. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని నాగరాజు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ రోడ్ మ్యాప్‌ని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పడం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతచిచ్చు పెట్టడానికి.. విద్వేషాలు రగల్చడానికి మాత్రమే తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా జనసేన తన విధానాన్ని పున:పరిశీలించుకోవాలని కోరుతున్నామన్నారు.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా పోరాడడంతోపాటు.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన కోరారు.
.
Discussion about this post