చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మొక్కలకు నీరు పోసే వారు కరువయ్యారు. ఫలితంగా మొక్కలు నిలువునా ఎండి పోతున్నాయి. మొక్కలకు నీరు పోయాల్సిన నందనవనం సిబ్బందికి ఇతర విధులు కేటాయించడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులు పచ్చదనం పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ముక్కంటి ఆలయ ప్రాంగణంతో పాటు భరద్వాజతీర్థం ప్రాంతంలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.
అధికారుల ఆశయం ఎంతో గొప్పది. మొక్కల పెంపకం కోసం ఎన్నో నిధులు ఖర్చు చేస్తున్నారు. అయితే ఆ ఆశయం నెరవేరే విధంగా చర్యలు తీసుకోవడం లేదు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే అన్ని మార్గాలతో పాటు… ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కుండీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు.
అయితే ఈ మొక్కలకు నీరు పోసే వారు లేక పోవడంతో నిలువునా ఎండి పోతున్నాయి. ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని పాతాళ వినాయక స్వామి ఆలయం సమీపంలో కుండీల్లో ఏర్పాటు చేసిన మొక్కలకు నీరు పోయక పోవడంతో అవి ఎండిపోతున్నాయి.
ఇవే కాకుండా ఆలయం ప్రాంగణంలో ఉన్న అన్ని మొక్కల దుస్థితి ఇలాగే ఉంది. భరద్వాజతీర్థంలో కూడా మొక్కలకు నీరు పోయక పోవడంతో నిలువునా ఎండి పోతున్నాయి. అధికారులు, ధర్మకర్తల మండలి వారు ఇకనైనా స్పందించి మొక్కలకు నీరు పోసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
.
Discussion about this post