సుబ్బారావు సగటు మద్యతరగతి ఉద్యోగి. పగలంతా ఆఫీసులో చాలా చెమటోడ్చినట్లుగా బిల్డప్ తో పనిచేసి, సాయంత్రం బలాదూరుగా ఊరంతా షికార్లు తిరిగి పొద్దుపోయే వేళకు ఇల్లు చేరుతుంటాడు. సదరు సుబ్బారావుకు అర్ధరాత్రి దాకా మేలుకుని టీవీ చూడడం అలవాటు! ఆరోజు కూడా టీవీ చూస్తూ కూచున్నాడు. అంతలో ఢామ్మని ఓ చప్పుడు వినిపించింది.
ఉలిక్కిపడ్డాడు. అసలే సుబ్బారావు భయస్తుడు! నిశాచరులు అంటే అర్థం దెయ్యాలే అని.. రాత్రిళ్లు దెయ్యాలు మాత్రమే తిరుగుతాయని మరెవ్వరూ రాత్రిపూట ఎలాంటి పనులూ చేయరని తాను నమ్ముతాడు. అలాంటిది పెద్ద చప్పుడు వినిపించేసరికి.. చాలా కంగారుపడ్డాడు. అలాగని అదేమీ బాంబు పేలుడు కాదు. అంతకంటె చాలా చిన్నది. నిజానికి బాంబు పేలుడైనా పర్లేదు.. ఒక క్లారిటీ ఉంటుంది.. ఈ చప్పుడేమిటో.. ఏ దెయ్యమైనా తన ఇంటి వసారాలోకి వచ్చేసిందో ఏమిటో అని కంగారు పడ్డాడు.
మళ్లీ వినిపించింది చప్పుడు. కొన్ని నిమిషాలు ఆగి.. మళ్లీ.. మళ్లీ.. ఆగి ఆగి వస్తూనే ఉంది. చప్పుళ్లు పెరుగుతున్నాయి. ఇంకా రకరకాల చిత్ర విచిత్రమైన చప్పుళ్లు వస్తున్నాయి. కంగారు స్థానే సుబ్బారావులో భయం ప్రవేశించింది. హాల్లో ఫ్యాను తిరుగుతున్నా.. చెమటలు కారిపోతున్నాయి. పీలగా కేకవేసి పడకగదిలో ఉన్న భార్యని పిలిచాడు. ‘దెయ్యాలొచ్చాయేమోనే’ అన్నాడు. సుబ్బారావు భార్య సుందరి కూడా విన్నది. చప్పుళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. వెళ్లి చూడండి అన్నది సుందరి. సుబ్బారావుకు ధైర్యం చాలలేదు. నేను కూడా వస్తాను పదండి అన్నది. భార్య చేయి గట్టిగా పట్టుకుని తలుపుతీసి బయటకు అడుగు పెట్టాడు. అక్కడ దెయ్యాలేం లేవు.
== ==
కానీ, రోడ్డు పట్టపగల్లా వుంది. చాలా లైట్లు వెలుగుతున్నాయి. రకరకాల చప్పుళ్లు రోడ్లోంచే వస్తున్నాయి. ఇదేమిటి మన రోడ్లో స్ట్రీట్ లైట్లు ఎప్పుడూ వెలగవు కదా.. ఇలా వెలుతురు ఉందేమిటి అనుకుంటూ రోడ్లోకి వెళ్లాడు. రోడ్డంతా ఉన్న గోతుల్ని పూడ్చడానికి కూలీలు గునపాలతో పారలతో పనిచేస్తున్నారు.
‘‘ఇదేంట్రా బాబూ కొన్ని నెలలుగా మా రోడ్డంతా గుంతలతోనే ఉంది. ఇప్పుడొచ్చి హఠాత్తుగా అర్ధరాతి మద్దెల దరువు.. సారీ, గునపం దరువు మొదలెట్టారేంటయ్యా బాబూ.’’ అడిగాడు సుబ్బారావు.
‘‘అయ్యన్నీ మాకు తెల్వదు సార్.. రేపు ఈ రోడ్లో ఎవరో శ్రమదానం చేస్తానన్నారట. రోడ్లు పూడుస్తా అన్నారట. సాయంత్రమే తెలిసింది.. రాత్రికిరాత్రే గోతుల్ని పూడ్చేయమన్నారు మాసారు..’’ వాడు చిరాగ్గా చెప్పాడు.
ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
‘‘ఈటైంలో రిపేర్లేంటయ్యా’’ కోప్పడ్డానికి ప్రయత్నించాడు సుబ్బారావు. ఎటూ దెయ్యం కాదని కన్ఫర్మ్ అయింది గనుక!
వాడు ఎగాదిగా చూసి.. ‘‘ఎవరో ఏదో చేస్తామని బెదిరిస్తారు సార్.. మొత్తానికి మా ఖర్మకొస్తుంది.. అర్ధరాత్రి పెళ్లాం పక్కలో ఉండాల్సిన టైంలో ఇక్కడ గునపం, పారలతో పనిచేస్తున్నాం..’’ కోప్పడ్డాడు.
సుబ్బారావుకు హఠాత్తుగా పెళ్లాం గుర్తుకొచ్చింది. తన చేతిని వదలించుకుని.. ఎప్పుడో ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈ గునపం దరువుల్లో తనకు నిద్రేం వస్తుందిలే అనుకుని.. ఇంట్లోకి వెళ్లి టీవీ ముందుకూర్చుని.. చానల్ మార్చాడు సుబ్బారావు.. రాత్రంతా జాగారం చేయడానికి!!
Discussion about this post