కడపలో అన్నా క్యాంటీన్ ను కూల్చడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ రైతు విభాగం ఉపాధ్యక్షులు ప్రకాశ్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన బుధవారం ‘ఆదర్శిని’తో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో ఉన్నతాశయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు.
ఈ క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5కే భోజనం దొరికేదన్నారు. ఈ విధానం వలన ఎంతో మంది పేదలు ఆకలి తీర్చకునే వారన్నారు. అయితే ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక మూయించి వేశారన్నారు.
ఈ కారణంగా పేదలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ ది కూల్చివేతల ప్రభుత్వమని… అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లెలో ప్రజావేదిక కూల్చారన్నారు.
ఇపుడు ఆయన సొంత జిల్లాలో పెట్రోలు బంకుకు అడ్డంగా ఉందని సాకు చూపుతూ.. అన్నా క్యాంటీన్ కూల్చడం ఎంతవరకు సబబని ప్రకాశ్ నాయుడు ప్రశ్నించారు.
ఇందుకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. లేదంటే తెలుగుదేశం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
.