ప్రపంచ ప్రసిద్ధి కాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి త్వరలో ప్రైవేటు రైలు పట్టాలు ఎక్కనుంది. దక్షిణ మధ్య రైల్వేలో తొలి ప్రైవేటు రైలు కూడా ఇదే కానుంది. ఇందుకోసం రైల్వే అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 11 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ఢిల్లీ నుంచి లక్నో వరకు ప్రైవేటు రైలు తేజస్ నడిచిన విషయం తెలిసిందే. తర్వాత మరికొన్ని మార్గాల్లో ప్రైవేటు తేజస్ రైళ్ళను ప్రవేశపెట్టారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ ఏడాది కొన్ని ప్రైవేటు రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు.
ఇందులో భాగంగా తొలుత హైదరాబాదు సమీపంలోని లింగంపల్లి నుంచి తిరుపతికి తొలి ప్రైవేటు తేజస్ రైలు నడిపేందుకు కసరత్తు మొదలైంది. ఇందుకోసం టెండర్లు పిలిచేందుకు రైల్వే అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే తిరుపతి, హైదరాబాదు మధ్య నిత్యం పలు రైళ్లు నడుస్తున్నాయి. అయినప్పటికీ ఈ మార్గంలో విపరీతంగా రద్దీ ఉంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి ప్రైవేటు రైలు కావడంతో సెంటిమెంటు పరంగా కూడా తిరుపతి నుంచి నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. త్వరలోనే లింగంపల్లి, తిరుపతి మధ్య నిత్యం ప్రైవేటు రైలు తేజస్ నడవనుంది. ముహూర్తమే ఖరారు కావాల్సి ఉంది.
తేజస్ రైలులో సాధారణ రైళ్లలో కంటే అధిక చార్జీలు వసూలు చేస్తారు. ప్రయాణ సమయం దగ్గర పడే కొద్దీ చార్జీలు ఆ మేరకు పెరుగుతూ ఉంటాయి. అయితే నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా రైలు గమ్యస్థానం చేరుకుంటే ప్రయాణ చార్జీలో గరిష్టంగా 250 రూపాయల వరకు ప్రయాణికుడికి పరిహారం కింద చెల్లించడం తేజస్ ట్రైన్ ల ప్రత్యేకత.
.

Discussion about this post