సామాజిక న్యాయాన్ని దెబ్బతీసి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు పేర్కొన్నారు. ఏ ఐ టి యు సి చిత్తూరు జిల్లా 15వ ప్రతినిధుల మహాసభలు తిరుపతిలోని రామారావు ప్రాంగణంలో కోదండం, ప్రేమ, రాజా అధ్యక్షతన జరిగింది.
మహా సభలు ఆరంభం లో ఏ ఐ టి యు సి జెండాను జిల్లా గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన కార్మికులకు సంతాప తీర్మానాన్ని చిన్నం పెంచలయ్య ప్రవేశపెట్టారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జి.ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు అన్నింటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి రిజర్వేషన్లు తీసివేసి దళిత బడుగు బలహీన వర్గాల వారిని బానిసలుగా చేసే విధానాలు మోడీ ప్రభుత్వం రూపొందిస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ లో 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 4 వేల మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉద్యోగులు ఉన్నారని అన్నారు.
దీనిని ప్రైవేటీకరణ చేస్తే వారి ఉద్యోగాలు పోతాయని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గకపోగా 100 రూపాయలు దాటించారని ధ్వజమెత్తారు. పెరిగిన ధరలతో సామాన్యుడు వస్తువులు కొనే పరిస్థితి లేదని అన్నారు. బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.
సంఘం పెట్టుకునే హక్కును కాలరాస్తున్నారని చెప్పారు. మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభలకు కార్మికులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య కార్మికులకు 24000 రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెండింగ్ లో పట్టకుండా ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్మిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర మహాసభలలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, కార్యదర్శులు రాధాకృష్ణ, రాజా, రవి, శివ, సాంబ తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post