సీబీఐ ప్రధాన కోర్టు తీర్పును వెలువరించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవారికి ఇదివరలో ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయడానికి నిరాకరించింది. పిటిషన్ తోసిపుచ్చింది. జగన్ అభిమానులకు ఇది పెద్ద ఊరట. అయితే రఘురామక్రిష్ణ రాజు కోర్టులో ఓడిపోయినా సరే.. తాను అనుకున్నది అనుకున్నట్టే సాధిస్తున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది.
రఘురామక్రిష్ణ రాజు లేవనెత్తన పాయింట్లను కోర్టు పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నంత మాత్రాన సాక్షులను ప్రభావితం చేస్తారని అనుకోలేమని, అలా చేసినట్టు ఆధారాలు లేవని పేర్కొంది. మొత్తానికి ఆయన వినతుల్ని తోసిపుచ్చింది. ఈ నిర్ణయంపై తాను హైకోర్టుకు వెళతానని పిటిషన్ వేసిన రఘురామక్రిష్ణ రాజు ప్రకటించారు కూడా. ఆయన సాధించదలచుకున్న విజయం అందులోనే ఉన్నదని, సీబీఐ కోర్టులో ఈ ఓటమి కూడా ఆయనకు ఓ రకంగా విజయమేననే అనిపిస్తోంది.
‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణలో ఉన్న నిందితుడు, జైలులో ఉండవలసినవాడ, బెయిలు మీద బయట ఉండి పరిపాలన సాగిస్తున్నాడు’ అనే అంశానికి జనబాహుళ్యంలో విస్తృత ప్రచారం కల్పించడం ఒక్కటే రఘురామ లక్ష్యంగా కనిపిస్తోంది. సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేయడం ద్వారా ఆయన ఈ విషయంలో పూర్తి సక్సెస్ సాధించారు. కొన్ని నెలలపాటూ జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దు గురించి మీడియాలో వార్తలు వచ్చేలా, జనం మాట్లాడుకునేలా వాతావరణం సృష్టించారు. ప్రతి ఒక్కరూ అనుకున్నట్టుగానే.. జనం ఆదరించిన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.
ఇప్పుడు రఘురామ తాను హైకోర్టుకు వెళతా అంటున్నారు. మీడియా పనిగట్టుకుని విస్మరిస్తే తప్ప.. ఆయన పిటిషన్ వేయడం, దాని వాదోపవాదాలు, కోర్టు విచారణ ఇలాంటి పరిణామాలన్నీ వార్తలే అవుతాయి. మరి కొంత కాలం పాటూ జగన్ బెయిల్ రద్దు గురించి జనం మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ పసలేని పిటిషన్ ను హైకోర్టు కూడా కొట్టేసే అవకాశాలే ఎక్కువ.
హైకోర్టు కూడా తన వినతిని కొట్టేసినంత మాత్రాన రఘురామ క్రిష్ణ రాజు బాధపడరు. ఓడిపోయానే అని అవమానం ఫీలవరు. తన ప్రయత్నం వృథా అని వెనుకంజ వేయరు. ఎందుకంటే ఆయన లక్ష్యం కేసు గెలవడం కాదు. జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడం మాత్రమే. హైకోర్టు కొట్టేస్తే మళ్లీ తాను సుప్రీం కోర్టుకు వెళ్తా అంటారు. అప్పుడిక ఆయన మరింత విజయం సాధించినట్టు అనుకోవాలి.
మళ్లీ కొన్ని నెలలపాటూ ‘జగన్ అనే సీఎం.. బెయిల్ మీద పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి’ అనే అంశానికి దేశవ్యాప్తంగా మీడియాలో ప్రచారం దక్కేలాగా చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి పక్కా ప్రణాళికతోనే.. ప్రతి ఓటమిలోనూ విజయాన్నే చూసుకుంటూ ముందుకు సాగడానికి రఘురామక్రిష్ణ రాజు స్కెచ్ వేసుకున్నట్లుగా కనిపిస్తోంది.
జగన్ ఇచ్చిన టికెట్ తో, వైఎస్సార్ సీపీ ఎంపీగానే గెలిచిన ఈ నాయకుడు, తనను చిన్నచూపు చూసినందుకు గాను.. రెచ్చిపోయి.. జగన్ ఇమేజిని తనకు చేతనైనంతగా డేమేజి చేయడం, చికాకు పెట్టడమే లక్ష్యంగా సాగుతున్నట్లుంది.
.

Discussion about this post