శ్రీకాళహస్తి రూరల్ మండలం లో మన్నారం బీటు పరిధిలోని గుండ్రాళ్ళ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం మోసుకుని వస్తున్న స్మగ్లర్లు ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది స్మగ్లర్లు పారిపోగా వారి కోసం గాలింపు చేపట్టారు.
ఎస్ ఈ బి డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి సూచన మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాలతో డిఎస్పీ మురళీధర్ పర్యవేక్షణ లో రైల్వే కోడూరు ఆర్ ఐ కృపానంద టీమ్ సోమవారం నుంచి శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది.
మంగళవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు గుండ్రాళ్ళ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టారు. కొందరు దుంగలను పడవేసి పారిపోగా, ఇద్దరిని పట్టుకోగలిగారు.
వారిని శ్రీకాళహస్తి మండలం కలువ కుంట గ్రామానికి చెందిన మించుల ఢిల్లీ బాబు (47), ఆంజనేయ పురానికి చెందిన పెముల సురేష్ (29) గా గుర్తించారు. వారి నుంచి 16 ఎర్రచందనం దుంగలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై ఎస్పీ మేడా సుందరరావు మాట్లాడుతూ లభించిన ఎర్రచందనం దుంగలు 352 కిలోలు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును సి ఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో సిఐ రామకృష్ణ, ఆర్ ఎస్ ఐ ఆలీ బాషా తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post