శ్రీకాళహస్తి ఆర్డీసీ డిపో నుంచి నెల్లూరుకు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఫలితంగా నెల్లూరుకు వెళ్లే ప్రయాణీకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయం ఆర్టీసీ అధికారులకు తెలిసినా ఏమీ తెలియనట్లు మౌనం పాటిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో నుంచి గతంలో ఏడు సర్వీసులు నడిపే వారు. కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఈ సర్వీసులు రద్దు చేశారు.
కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రయాణాలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే అందుకు అనుగుణంగా ఆర్టీసీ వారు సర్వీసులను నడపడం లేదు. ముఖ్యంగా శ్రీకాళహస్తి- నెల్లూరు మధ్య నడుపుతున్న సర్వీసులు ఆపడం వలన ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
తిరుపతి నుంచి నెల్లూరుకు వెళ్లే బస్సులు అత్యధికం బైపాస్ గుండా వెళుతున్నాయి. గూడూరు డిపోకు చెందిన కొన్ని బస్సులు మాత్రమే శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండుకు వస్తున్నాయి. వీటి కోసం ప్రయాణీకులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేసవి కావడంతో ప్రయాణాలు చేసే వారి సంఖ్య చాలా పెరిగింది.
అంతేకాకుండా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులు కూడా చాలా మంది నెల్లూరు, గూడూరుకు వెళుతుంటారు. ఇక్కడ నుంచి డైరెక్టు బస్సులు లేక పోవడంతో వీరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక శ్రీకాళహస్తి డిపో నుంచి గతంలో తిరుమలకు 24 సర్వీసులు నడిపే వారు.
అయితే ప్రస్తుతం 19 సర్వీసులు మాత్రమే నడుపుతున్నారు. అదేవిధంగా గతంలో శ్రీకాళహస్తి-తిరుపతి మధ్య మెట్రో సర్వీసులు 21 నడిపేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 16కు కుదించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నుంచి నడిపే బస్సుల సంఖ్య కుదించడం వలన ప్రయాణీకులు అనేక కష్టాలు పడుతున్నారు.
రద్దీని, ప్రయాణీకులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై శ్రీకాళహస్తి డిపో మేనేజరు సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా డీజిల్ ధరలు పెరగడం… ఆదాయం తగ్గడం వలన శ్రీకాళహస్తి-నెల్లూరు మధ్య సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన చెప్పారు.
నెల్లూరు వెళ్లాల్సిన ప్రయాణీకులు గూడూరు, వాకాడు డిపో బస్సుల ద్వారా వెళుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
.