తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఇన్ ఛార్జి కార్యనిర్వహణాధికారిగా కేవీ సాగర్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్న డి.పెద్దిరాజును కడప జిల్లా రవాణా, రోడ్లు, భవనాల స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టరుగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి దేవదాయశాఖ ఆర్జేసీగా పని చేస్తున్న కేవీ సాగర్ బాబుకు ముక్కంటి ఆలయ ఇన్ ఛార్జి కార్యనిర్వహణాధికారి (ఎఫ్ఏసీ) గా నియమిస్తూ ఈ నెల 18న రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ ఉత్తర్వుల ప్రకారం కేవీ సాగర్ బాబు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మునుపటి ఈవో పెద్దిరాజు నుంచి బాధ్యతలు స్వీకరించారు. అంతకు మునుపు ఆలయ అధికారులు ఈయనకు దక్షిణ గోపురం వద్ద సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కాగా బదిలీపై కడప జిల్లాకు వెళుతున్న పెద్దిరాజును ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఇక ఇన్ ఛార్జి ఈవోగా బాధ్యతలు చేపట్టిన సాగర్ బాబు మాట్లాడుతూ… ముక్కంటి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని… సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
.