చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం రాజగోపాలపురం లో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డి సోమవారం పరిశీలించారు.
స్థానిక ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డిపిఓ దశరథరామిరెడ్డి, ఎంపీడీవో సురేంద్ర నాథ్, తహసిల్దార్ శ్రీదేవి తదితరులు రాజగోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి అక్కడ తలదాచుకున్న వరద బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
బాధితులకు నాణ్యమైన భోజనం ,తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితి పై అంచనావేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.
వరద ముంపునకు గురవుతున్న నేపథ్యంలో రాజగోపాలపురం పంచాయతీ బాల గోపాలపురం బాధితులు 52 మందిని ముందస్తుగా పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు, వైయస్సార్సీపి జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు బిరేంద్ర వర్మ, అధికారుల బృందంతో కలిసి భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు.
అలాగే ఇళ్లలోకి నీరు చేరిన బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు .ఈ నేపథ్యంలో ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే పునరావాస కేంద్రంలో ఉంటున్న బాధితులకు త్వరలోనే ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవి, పంచాయతీ సెక్రెటరీ సురేష్, రజిత తదితరులు ఉన్నారు.
.