పెండింగ్లో పడ్డ రెండు ఫ్రీజింగ్ డిఏలను వెంటనే మంజూరు చేయాలని చిత్తూరు జిల్లా సత్యవేడు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పన లలిత్ కుమార్ కోరారు.
తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ఏపీజేఏసీ పిలుపుమేరకు స్థానిక ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఐక్య వేదిక సంఘం నేతలు మంగళవారం ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పనలలిత్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించిన పట్టించుకోలేదన్నారు .ఈ నేపథ్యంలోనే ఐక్యవేదిక ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది అన్నారు . కరువు భత్యం ఐదు వాయిదాలు ,రెండు ఫ్రీజింగ్ డిఏలు విడుదల చేయడంలో ప్రభుత్వం శీతకన్ను చూపుతున్నట్టు ఆయన ఆరోపించారు.
అలాగే పిఆర్సి అమలులో జాప్యం నెలకొనడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు .ఏపీజిఎల్ఐ వంటి రూపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము తిరిగి పొందడానికి నెలల తరబడి వేచి ఉండే పరిస్థితి తలెత్తిందన్నారు .పైగా ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్కార్డులు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
2021 జూలై 31 తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మంజూరు కావడం లేదన్నారు . ఇప్పటికైనా ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు .లేదంటే ఆందోళన తీవ్రరూపం దాలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యుటిఎఫ్ నాయకులు గురునాథం ,త్యాగరాజు ,ఏపిటిఎఫ్ నాయకులు కుప్పయ్య , శ్రీనివాసరాజు ,ఎస్టియు నాయకులు వెంకటేశులు ,హిమబిందు ,మండల పరిషత్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శివయ్య , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post