ఇవాళ్టి రోజుల్లో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా.. ఓటు బ్యాంకును ఉద్దేశించిన సంక్షేమ నిర్ణయాలు తీసుకోకుండా ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగిస్తుందని అనుకోవడం భ్రమ. అలాగని ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే నిర్ణయాలు కూడా సరికాదు. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అమలు చేయబోతున్న ధన వితరణ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థకు చేటు చేసేలా కనిపిస్తోంది.
ఇప్పటిటికే సర్కారు బడుల్లో చదువుకోవడం అనేది నేటి సమాజంలో నామోషీ అయిపోయింది. చెంతనే ఉన్న ప్రభుత్వ పాఠశాలను వద్దనుకుని కుగ్రామాల నుంచి కూడా దూరాన ఉన్న పట్టణాలకు పిల్లల్ని కష్టనష్టాలకోర్చి పంపుతున్నారు. ప్రభుత్వ స్కూలులో ఎలా చెబుతున్నారో పరిశీలించి.. అక్కడి ప్రమాణాలు బాగా లేవని అనిపించిన తర్వాత.. ప్రెవేటు స్కూళ్లను ఆశ్రయించినా అర్థముంటుంది. కనీసం స్కూలులో చదువు ఎలా చెబుతున్నారో అర్థం చేసుకోలేని, ప్రెవేటు స్కూళ్ల కెళుతున్న తమ బిడ్డలు ఏం నేర్చుకుంటున్నారో తెలుసుకోలేని నిరక్షరాస్యులు కూడా ప్రభుత్వ స్కూళ్లను చులకనగా చూసే పరిస్థితి ఉంది. నిజానికి పోల్చి చూసినప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో వసతులు చాలా మెరుగ్గా ఉంటున్నాయి. ప్రభుత్వ టీచర్లు పొందే జీతాలలో నాలుగోవంతు కంటే తక్కువకే ప్రెవేటు స్కూలు టీచర్లు పనిచేస్తున్నారు. విద్యార్హతల విషయంలో కూడా ప్రభుత్వ టీచర్లే ఎక్కువ. ఇన్ని ఉన్నప్పటికీ ఆ స్కూళ్లకు వెళ్లే దిక్కు ఉండడం లేదంటే… ప్రెవేటు విద్య పట్ల ప్రజల్లో ఉన్న మూర్ఖ వ్యామోహమే కారణం.
జగన్ ప్రభుత్వం 15వేల ఆర్థిక సాయం చేయదలచుకున్నప్పుడు.. దానిని ప్రభుత్వ స్కూళ్లకు మాత్రం పరిమితం చేస్తే.. ఒక్క ఉత్తర్వుతో రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడులు కళకళ లాడిపోతాయనే ఆశ కలిగింది. తీరా ఇప్పుడున్న స్కూళ్లను కూడా మూతపెట్టించే ప్రమాదాన్ని సూచిస్తూ… ప్రెవేటు స్కూళ్లకు కూడా దీనిని వర్తింపజేస్తున్నారు.
నిజానికి అమ్మఒడి సాయం ఎవరికి అందించాలనే విషయంలో ప్రభుత్వంలోని సచివుల మధ్యనే భిన్నాభిప్రాయాలు, గందరగోళం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే తొలుత విద్యామంత్రి ‘అన్ని స్కూళ్లకూ’ అని ప్రకటించారు. దానిపట్ల ప్రభుత్వ టీచర్లనుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఇంతలో ఆర్థిక మంత్రి బుగ్గన.. ప్రెవేటు స్కూళ్లకు ఇది వర్తించదు అని ఓ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆలోచన భేష్ అనుకున్నారంతా! ఈలోగా ముఖ్యమంత్రి కార్యాలయం… స్పష్టత ఇస్తూ.. ప్రెవేటు స్కూళ్లకు కూడా, కేవలం పేదరికమే ప్రాతిపదికగా ఇది వర్తిస్తుందని ప్రకటించింది.
ఏ రకంగా చూసినా ఇది బాధ్యత లేని నిర్ణయం. ఇలాంటి నిర్ణయం వలన… ప్రభుత్వ స్కూళ్ల వ్యవస్థకు చేటు జరుగుతుంది. జగన్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే… ఇలాంటి ధన వితరణ ఏర్పాటు వలన.. రానున్న అయిదేళ్లలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేసేది జరగదని హామీ ఇవ్వాలి. ప్రభుత్వ స్కూళ్లను తలదన్నేలా, ప్రజలు తమంతగా వచ్చి పిల్లల్ని చేర్పించేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు పూనుకోవాలి. రెండో హామీ ఇచ్చేయగలరు. కానీ, దీనిని అమలు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆలోగా ఎన్ని ప్రభుత్వ స్కూళ్లు మూసివేయాల్సి వస్తుందో తెలియదు.
ఏ రకంగా చూసినా.. జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. యావత్ సమాజాన్ని ఏకమొత్తంగా ప్రభావితం చేసే, భవిష్యత్ తరాల మీద ప్రభావం చూపే ఇలాంటి విషయాల్లో కేవలం రాజకీయ నిర్ణయాలు పనికిరావు. విద్యారంగంలో సమూల సంస్కరణలు కోరుకునే మేధావులు, నిపుణులతో సమగ్రంగా అధ్యయనం చేయించి… ప్రభుత్వ వ్యవస్థలు సర్వనాశనమైపోకుండా ఉండేలా నిర్ణయాలను మార్చుకుంటే బాగుంటుంది.

.

Discussion about this post