తాజాగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన పట్టభద్రులకు మరిన్ని నైపుణ్యాలను అందించేందుకు నైపుణ్య యూనివర్సిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో 30 నైపుణ్య కళాశాలలు కూడా ఏర్పాటు అవుతాయి. దేశంలోని ప్రధాన నగరాలలో శిక్షణ పొందుతున్న యువతరంతో పోటీ పడాలంటే నైపుణ్యాభివృద్ధి చాలా ముఖ్యమని, దానిమీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంకల్పిస్తున్నారు. ఇవి సమర్ధించ దగిన నిర్ణయమే.
అయితే ఇటీవలి కాలంలో వరుసగా వెలువడుతున్న నిర్ణయాలను గమనిస్తే అభివృద్ధిగా జగన్ భావిస్తున్న ప్రతి విషయాన్ని విశాఖపట్నం లోనే ఏర్పాటు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నాటి నుంచి, ఇప్పటిదాకా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు కొత్తగా ఇచ్చినవి చాలా తక్కువ. లేవనే చెప్పాలి!
అభివృద్ధి వికేంద్రీకరణ ప్రతిపాదనలు… అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును ప్రధాన న్యాయమూర్తితో కూడిన హైకోర్టు కేంద్రంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ రెండింటి విషయంలో కూడా పూర్తి స్పష్టత ఇంకా రాలేదు. కర్నూలుకు రాజధాని అనేది.. ఇప్పటికీ కేంద్రం, సుప్రీంకోర్టు ఆమోదం మీద ఆధారపడి ఉంది. అమరావతి సంగతి సరేసరి. శాసనసభ తప్ప… ఆ ప్రాంతానికి ఇప్పటిదాకా మరొక వరం లేదు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించడం ఒక్కటే… అమరావతి ప్రాంతానికి సంబంధించి ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం.
అదే సమయంలో విశాఖ విషయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేకానేక వరాలను గుప్పిస్తున్నారు. వాటిలో భాగమే, తాజాగా నైపుణ్య యూనివర్సిటీ. ఎటూ రాష్ట్రంలో 30 నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేయదలచుకున్నప్పుడు… యూనివర్సిటీని విశాఖ కాకుండా మరొక ప్రాంతానికి కేటాయించి ఉంటే వికేంద్రీకరణ అనే పదానికి అర్థం ఉండేది. ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉండే ప్రాంతంలోనే.. నైపుణ్య యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం గమనిస్తే, అన్ని వరాలు విశాఖపట్నానికి దక్కుతున్నట్లుగా అనిపిస్తుంది.
మరో కోణంలో గమనించినప్పుడు గత ఐదేళ్లలోను, అంతకుముందు తొమ్మిదేళ్లలోను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో చేసిన తరహా తప్పులనే జగన్ కూడా రిపీట్ చేస్తున్నారని అనిపిస్తుంది. అమరావతిలో రాజధాని అని ప్రకటించిన చంద్రబాబు… వివిధ ప్రైవేటు యూనివర్సిటీలు అన్నింటికీ అదే ప్రాంతంలో రెండేసి వందల ఎకరాల భూములు కేటాయించారు. అప్పట్లో తన ప్రభుత్వం తలపెట్టిన ప్రతి పనికి అమరావతినే కేంద్రంగా ప్రకటిస్తూ వచ్చారు. ఇవాళ అమరావతి ప్రాంతం నుంచి రాజధానిని తరలించడానికి జగన్ నిర్ణయం తీసుకుంటే మిగిలిన ప్రాంతాల ప్రజలు పెద్దగా వ్యతిరేకించకపోవడానికి అదే కారణం.
ఇప్పుడు జగన్ కూడా ఇంచుమించు అదే తప్పు చేస్తున్నారు. తాను తలపెట్టే ప్రతి అద్భుతానికి విశాఖపట్నాన్ని కేంద్రబిందువుగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి పోకడలు మిగిలిన రాష్ట్రంలో ఖచ్చితంగా అసంతృప్తిని రేకెత్తిస్తాయి. ప్రభుత్వం వికేంద్రీకరణ పేరిట సమతుల్య అభివృద్ధికి గురించి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ… ప్రాంతీయ అసమానతలు మరొక కోణం లోంచి ప్రజలను బాధిస్తుంటాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆచరణాత్మక దృక్పథంతో ఆలోచించి భవిష్య నిర్ణయాలనైనా సరైన దిశలో తీసుకోవాలని ప్రజలు అభిలషిస్తున్నారు.
.

Discussion about this post