చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొవిడ్ నిబంధనలకు లోబడి ఆలయం లోపల మాత్రమే ఈ ఉత్సవాలు జరిపే అవకాశం ఉంది.
కరోనా మూడవ దశ విజృంభిస్తుండటంతో ఆలయం వెలుపల జరిపే ఉత్సవాలు మొత్తం రద్దు చేయాలని రాష్ట్ర దేవదాయ,ధర్మదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న నిర్వహించాల్సిన కైలాస గిరి ప్రదక్షిణ (కొండచుట్టు) ఉత్సవం రద్దు చేశారు.
ఈ నిబంధనల నేపథ్యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప… ఈ ఏడాది ముక్కంటి బ్రహ్మోత్సవాలు లేనట్లే. ఎక్కువ భాగం ఏకాంతంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్బంగా ప్రతి యేటా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవవంగా నిర్వహించడం ఆనవాయిలతీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఫ్రిబ్రవరి 24 నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది.
ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న అనగా సంక్రాంతి పర్వదినం మరుదినం కైలాస గిరిప్రదక్షిణ (కొండ చుట్టు) ఉత్సవం నిర్వహించాలని ముహూర్త ఖరారు చేశారు. కొండచుట్టు కోసం రోడ్డుకు కూడా మరమ్మతులు చేశారు.
ఇంతలోపే రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కొవిడ్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నందున ఆలయాల బయట నిర్వహించే ఉత్సవాలు రద్దు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో గిరి ప్రదక్షిణ రద్దు చేశారు. ఇవే ఉత్తర్వులు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకూ వర్తిస్తాయి. కొవిడ్ మూడవ దశ రాష్ట్రంలో ఇపుడిపుడే ఆరంభమైంది.
ఆరంభంలోనే రాష్ట్రంలో గత గురువారం 4,348 కొవిడ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి మాసాంతానికి కొవిడ్ ఉధృతి తారా స్థాయికి చేరుతుందని ఇప్పటికే నిపుణులు, వైద్యశాఖ అధికారులు ప్రకటించిన విషయం కూడా మనకు తెలుసు. ఈ కారణంగా ముక్కంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయం లోపల వరకే పరిమితం కానున్నాయి.
.

Discussion about this post