అది పేరుకే పెద్దాససుపత్రి. చిన్న రోగానికి కూడా సరైన వైద్యం చేయరు. మాట్లాడితే తిరుపతికి రెఫర్ చేసి చేతులు దులిపేసుకుంటారు. అత్యవసర విభాగంలో అయితే మరీ దారుణం. అక్కడ సమాధానం చెప్పే వారే ఉండరు. ఫలితంగా పేద రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
సకాలంలో వైద్యం అందక ఈ ఆస్పత్రిలో ప్రాణాలు పోవడం సహజంగా మారిపోయింది. ఈ విషయం అధికారులకు తెలిసినా… పట్టించుకోక పోవడంతో రోజు రోజుకూ పరిస్థితి దారుణంగా మారుతోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలో ఎంతో ఉన్నతాశయంతో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిర్మించారు. ఈ ఆస్పత్రి రావడానికి అప్పటి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎంతో కృషి చేశారు. తెలుగుదేశం హయాంలో నిత్యం పర్యవేక్షణ ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంతో మెరుగైన వైద్యం అందేది. తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ డయాలసిస్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం బొజ్జల బృందమ్మ ఎంతో కృషి చేసినట్లు అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు.
ఈ కేంద్రం పేద డయాలసిస్ రోగులకు వరంగా మారింది. ఇంత మెరుగైన చికిత్సలు అందించే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి సుమారు మూడేళ్లుగా జబ్బు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే వైద్యులు చాలా మంది ప్రైవేటుగా క్లినిక్ లు నడుపుతున్నారు. ఈ కారణంగా వారు సొంత వ్యాపారంపై దృష్టి పెడుతూ… ప్రభుత్వ ఆస్పత్రిలో నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. వారు ఎపుడు విధులకు వస్తారో కూడా తెలియదు. అత్యవసర విభాగంలో కూడా ఇదే దుస్థితి.
ఈ కారణంగా అత్యవసర విభాగంలో పొరుగు సేవల సిబ్బంది వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. వీరు కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండానే తిరుపతికి రెఫర్ చేస్తున్నారు. చిన్న సమస్యలకు కూడా తిరుపతికి రెఫర్ చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ ఆస్పత్రిలో దుస్థితి ఎలా ఉందో ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం భోజనం చేసే సమయంలో మిక్సర్ తింటుండగా ప్లాస్టిక్ కవరుకు వేసిన పిన్ పొరబాటున పంటి వద్ద గుచ్చుకుంది. అది కంటికి బాగా కనపడుతోంది. ఇంటి వద్దనే తీయడదానికి ప్రయత్నించినా.. అది రాక పోవడంతో ఆ వ్యక్తి తమ సోదరునితో కలసి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చారు.
అత్యవసర విభాగానికి వెళ్లి.. పంటి వద్ద చిక్కుకు పోయిన పిన్ తీయాలని కోరాడు. అప్పుడు వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. ఓ పొరుగు సేవల ఉద్యోగి తన సెల్ ఫోన్ తీసుకుని పంటి వద్ద లైట్ వేసి పరిశీలించాడు. అది తనకు కనబడటం లేదని చెప్పాడు. బాధితుడు చూపుతున్న అతడు పట్టించు కోలేదు. డ్యూటీ డాక్టర్ గురించి ఆరా తీయగా తమకు తెలియదని.. బోర్డులో పేరు ఉంటుదని.. అందులో చూసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
అంతటితో ఆగకుండా పిన్ ఇక్కడ తీయలేమంటూ.. తిరుపతికి రెఫర్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో సదరు బాధితుడు భయపడి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇదండీ శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి దుస్థితీ.
ఇదొక ఉదాహరణ మాత్రమే. నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎంతో ఉన్నతాశయంతో పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బతి తీరు కారణంగా ఆశయం నెరవేరడం లేదు. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Discussion about this post