పక్కవాడి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే వాడు విజేత అవుతాడని.. వ్యక్తిత్వ వికాస పాఠాల్లో చెప్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నారా?
సాధారణంగా సిటింగ్ ప్రజాప్రతినిధి హఠాన్మరణానికి గురైతే..90 శాతం సందర్భాల్లో ఆయన కుటుంబ సభ్యులను ఉప ఎన్నికలో నిలబెట్టడం మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు అలవాటు అయిపోయింది. సానుభూతి వెల్లువలా ఉంటుంది గనుక.. ఒకటీ అరా సందర్భాల్లో వాళ్లే గెలుస్తూ ఉంటారు కూడా. అందుకే ఇలాంటి ఎన్నికల్లో కొన్నిసార్లు ఇతర పార్టీలు మిన్నకుండిపోయి.. ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తుంటాయి. కానీ.. జగన్మోహన్ రెడ్డి.. తిరుపతి ఎంపీ ఎన్నిక విషయంలో విలక్షణమైన నిర్ణయం తీసుకున్నారు. మానవతా దృక్పథంతో స్పందించడంలో తండ్రిలాగే ముందుండే జగన్.. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వాలనుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామం. అయితే.. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి పాలవడం.. జగన్ ఆలోచనల్ని మార్చిందని చెబుతున్నారు.
దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ మరణించారు. ఆయన కొడుకు టికెట్ ఆశించినప్పటికీ.. సానుభూతి గరిష్టంగా రాబట్టడానికి కేసీఆర్, సోలిపేట భార్యను ఎంపిక చేశారు. ఎన్నికల నిర్వహణలో గండరగండడుగా పేరున్న హరీష్ రావు.. బాధ్యత మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకుని ప్రచారం నిర్వహించారు కూడా. అయినా సరే ఫలితం దక్కలేదు. రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిన రఘునందన్ రావు చేతిలో.. సోలిపేట భార్య ఆశించిన సానుభూతి దూదిపింజలా లేచిపోయింది. అప్పటికీ ఎమ్మెల్యేగా సోలిపేటకు స్థానికంగా మంచి పేరుంది. అయినా సరే ఫలితం దక్కలేదు.
దీనిని బట్టి… రాజకీయ నాయకులు తాము నమ్మే సిద్ధాంతాలను తిరగరాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక నాయకుడి మీద నమ్మకంతో గెలిపించాక.. అతడు చనిపోతే.. అతడి కుటుంబంలో ఎవరో ఒకరికి పట్టం కట్టే రోజులు పోయాయి. దానికి నిదర్శనమే దుబ్బాక ఉప ఎన్నిక. అక్కడ టీఆర్ఎస్‌కు ఎదురైన ఫలితం జగన్ మోహన్ రెడ్డిని పునరాలోచనలో పడేసినట్టు తెలుస్తోంది. ఈ రోజుల్లో ప్రజల్లో మార్పు వచ్చిందని.. కేవలం సానుభూతి వల్ల గెలిచేది ఉండదని.. ఆయన అర్థం చేసుకున్నారు. అందుకు ఫలితమే.. అభ్యర్థి మార్పు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం సానుభూతి వలన.. ప్రజాక్షేత్రంలో గుర్తింపులేని వ్యక్తులు చట్టసభకు ప్రజల ద్వారా ఎన్నిక కావడం కష్టం అని దుబ్బాక ప్రపంచానికి చాటి చెప్పింది. మారుతున్న ప్రజల మనోభావాలకు అనుగుణంగానే.. జగన్మోహన్ రెడ్డి కూడా తదనుగుణమైన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా భావించాల్సి వస్తోంది.
ఇవీ చదవండి : జగన్ నిర్ణయంతో ప్రత్యర్థులు బెంబేలు గురుమూర్తి ఎవరు? ఎలా ఎంపీ కేండేటు అయ్యారు?