యు ఎఫ్ బి యు ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న పోరాటం నిజమైన ప్రజా, దేశభక్తి పోరాటమని ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ అన్నారు.
బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా స్థానిక రామానుజ సర్కిల్ వద్ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం కాకుండా భారతదేశానికి వెన్నెముక అయిన బ్యాంకింగ్ రంగాన్ని పరిరక్షించడానికి పోరాటం చేయడం అభినందనీయమన్నారు.
దీనికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలు బ్యాంకుల్లో పొదుపు చేస్తే దానిని బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో పెడుతున్నారని ఆయన విమర్శించారు. దేశంలో తప్పుడు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సంవత్సరం పాటు రైతులు చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అవినీతి అంతం అనే నినాదంతో ముందుకొచ్చిన బిజెపి నేడు అవినీతి అంతా సొంతం చేసుకున్నదని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులు అమ్మేస్తూ దేశ ఆర్థిక పునాదులను బిజెపి దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి రాకముందు 16 లక్షల 50 వేలున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య నేడు 9 లక్షల 80 వేలకు పడిపోయిందంటే ప్రైవేటీకరణ ఎంత వేగంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు.
దీనికి వ్యతిరేకంగా రైతు పోరాటం స్ఫూర్తితో బ్యాంకు ఉద్యోగులు ప్రజా భాగస్వామ్యంతో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె కు మద్దతు గా ముద్రించి న కరపత్రాలు పంచారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి వెంకటరత్నం, ఐ ఎఫ్ టి యు నగర నాయకులు లోకేశ్వర్ రెడ్డి, రమణ, మహేష్, నాగరాజు, ముని కుమార్, సిటీబిఈసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత కుమార్, యుఎఫ్బియు కన్వీనర్ విజయ భాస్కర్, సభ్యులు మూర్తి, నరసింహులు, జనార్ధన్, నాగేశ్వరరావు, విష్ణుప్రియ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.
.

Discussion about this post