తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ గార్బేజ్ బ్యాగులు ఏర్పాటుచేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఘాట్ రోడ్లు, నడకదారుల్లో రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న శ్రీనివాస సేతు పనులను పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు, స్మార్ట్ సిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చీఫ్ ఇంజినీర్ ను ఆదేశించారు.
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం పనులను నిర్దేశిత వ్యవధిలోపు పూర్తి చేయాలని ఈవో సూచించారు. తిరుమలలో విద్యుత్ మీటర్ల ఏర్పాటు పనులను జూలై లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నెయ్యి ప్లాంట్ యంత్రసామగ్రి ఏర్పాటు, ఇతర పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్, గోశాల అధికారులకు సూచించారు. ఎస్వీబీసీలో ప్రసారం చేసేందుకు వీలుగా “వేద విజ్ఞాన తరంగిణి” పేరుతో ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో రూపొందిస్తున్న ఎపిసోడ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రసారం చేసేందుకు ఎస్వీబీసీ రూపొందిస్తున్న “భారతీయ విజ్ఞాన ధార” కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో పెండింగులో ఉన్న ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ పనులను వేగవంతం చేయాలని కోరారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు, సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందించేందుకు క్యాంటీన్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమీక్షలో జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఎఓ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ వెంగమ్మ, వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post