అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరు వేంకటాద్రీశుని అనుగ్రహం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు అయిన టీటీడీ ఆలయాల్లో ప్రతి చోటా గోవింద నామస్మరణలతో భజనలు హోరెత్తనున్నాయి. రాష్ట్రంలోని అన్ని టీటీడీ ఆలయాల్లోనూ భజనలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధర్మప్రచారంలో భాగంగా శ్రీవారి భజనలను సార్వజనీనం చేసేందుకు సంకల్పిస్తున్నారు.
తిరుమల, ఇతర ప్రాంతాల్లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో స్వచ్ఛందంగా భజనలు చేసేందుకు భక్తులకు అవకాశం కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమాల అధికారిని ఆదేశించారు.
టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం నిర్వహించిన సీనియర్ అధికారుల సమావేశంలో ఈవో మాట్లాడుతూ తిరుమలలో స్వచ్ఛందంగా జరగాల్సిన భజన కార్యక్రమాలను పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. భజన కళాకారులు భజన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ రూపొందించాలని అధికారులకు సూచించారు.
తద్వారా కళాకారులు, భజనమండళ్ళకు స్వచ్ఛందంగా భజనలు చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. తిరుమలలో నాదనీరాజనం వేదిక ద్వారా విరివిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. నాదనీరాజనం కార్యక్రమాల్లో అవకాశం రానివారు సైతం ఈ భజన కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకునేలా.. ఈవో ప్రణాళిక సిద్ధం చేయిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వేంకటేశ్వర ఆలయాల్లో..
టిటిడి నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో 502 ఆలయాలను మారుమూలన ఉన్న గిరిజన, ఎస్‌సి, మత్స్యకార ప్రాంతాల్లో నిర్మించారు. ఈ ఆలయాల్లో అనునిత్యం భజనలు నిర్వహించేందుకు అవసరమయ్యే భజన సామగ్రిని టిటిడి సమకూర్చేలా.. ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అంతేగాక రాష్ట్రంలోని అన్ని వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ప్రతి శనివారం శ్రీ వేంకటేశ్వర పూజా విధానం నిర్వహించడం, భగవద్గీత పారాయణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఈవో చెప్పారు.
గ్రామాల్లోని దేవాలయాల్లో నిత్యం భజన కార్యక్రమాలు నిర్వహించే విషయమై స్థానిక ఆలయ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. కనుక వివిధ ప్రాంతాలలో వున్న భజనమండళ్ళు, కళాకారులు స్వచ్ఛందంగా ఆలయాలలో భజనలు చేసేందుకు టిటిటి కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జవహర్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post