తమిళనాడులో విచిత్రమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి విపక్షంలో ఉన్న డీఎంకే అధికారంలోకి రావడం అనేది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జయలలిత మరణం తర్వాత.. చుక్కాని లేని నావలాగా ఎన్నికలను ఎదుర్కొంటున్న అన్నా డీఎంకే వరుసగా పదేళ్ల అధికారం తర్వాత.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఆ పార్టీల్లో కనిపించని చీలికలు, గ్రూపులు వారిని మరింతగా ఓటమి దిశగా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అన్నాడీఎంకేతో మైత్రి ద్వారా.. తమకు ఏమాత్రం ఠికానా లేని తమిళనాడులో అస్తిత్వం పెంచుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
డీఎంకే విజయపథంలో ఉన్న సంకేతాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. అయితే.. తమాషా ఏంటంటే.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. అధికారంలోకి వచ్చే పార్టీలో కలిసిపోవడానికి పలువురు ఇప్పటినుంచే బేరాలు కుదుర్చుకుంటున్నట్టుగా వినిపిస్తోంది. డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు బలంగా ఉన్నారు. వారు గెలిచే చాన్సుంది. అయితే.. తమ పార్టీ అన్నాడీఎంకే గెలిచే చాన్సు లేదు గనుక.. వారు రాజకీయ భవిష్యత్తు కోసం- ఇప్పుడే డీఎంకేతో డీల్ చేసుకుంటున్నారు. గెలిచిన తర్వాత.. తాము కూడా పార్టీ ఫిరాయించి డీఎంకేలో చేరిపోతాం అని ప్రపోజల్ పెట్టుకుంటున్నారు.
ఒకసారి ఓడిపోతే.. అన్నా డీఎంకేలో ఉండే అసంతృప్తులు, అంతర్యుద్ధాలు అన్నీ బట్టబయలయ్యే అవకాశం ఉంది. ఆ పార్టీ చీలికలు పేలికలుగా మారిపోయే ప్రమాదం కూడా ఉందని పలువురు అంచనావేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో.. ఆ పార్టీ తరఫున గెలవబోయే కొందరు ఎమ్మెల్యేలు కూడా డీఎంకే తీర్థం పుచ్చుకోబోతున్నారన్న గుసగుసలు నిజమే అయితే… జయలలిత మరణానంతరం ఆమె పార్టీ కూడా అంపశయ్య మీద ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది.
.