మూడు రాజధానుల విషయంలో సుమారు రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగా మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారో అందరికీ తెలుసు. రైతుల దీక్షలు ఏడువందల రోజులు దాటుతున్నా.. వందల మంది అసువులు బాస్తున్నా.. ఏం జరుగుతున్నా సరే ఆయన పట్టించుకోలేదు. తాను ఏలే రాష్ట్రానికి మూడే రాజధానులు అనే కాన్సెప్టును చాలా క్లియర్ గా కనబరిచారు.
విధివశాత్తూ ఆయన తన ఈగోను, అహాన్ని చంపుకోవాల్సి వచ్చింది. కోర్టు విచారణ రోజువారీ మొదలైన తర్వాత.. అది తనకు ప్రతికూలంగా వెళ్లబోతున్నదనే సంగతి అర్థం కాగానే జగన్.. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించి, సీఆర్డీయేను పునరుద్ధరించారు. దాంతో కేసు ఆగింది. ఆ చర్య ద్వారా ఇక చికాకు తొలగిపోయినట్టే అని జగన్ అనుకున్నారు.
కానీ అసలు ప్రమాదం ఆ తర్వాత కూడా పొంచి ఉన్నట్టే కనిపిస్తోంది. జగన్మోహన రెడ్డి పరిస్థితి పాపం.. ‘బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్న’ సామెత చందంగా తయారైంది. ఆయనేమో తాను కలలు కన్న మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్నారు గానీ.. ప్రజలకు ఆ పదంలో ఉండే మజా పోయింది. జగన్కు కల చెదిరింది గానీ.. ఫలం కూడా దక్కలేదు. ఆ చట్టం రద్దుతో.. ఆటోమేటిగ్గా.. కోర్టులో జరుగుతన్న రోజువారీ విచారణ మొత్తం రద్దవుతుందని ఆయన అనుకున్నారు గానీ.. వాస్తవంలో అలా కనిపించడం లేదు.
మూడు రాజధానుల బిల్లు కేసు కోర్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిల్లు ఉపసంహరించుకునే హక్కు గానీ, ఆ బిల్లుని తాకే హక్కుగానీ లేదని అడ్వకేట్ శ్యామ్ దివాన్ ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు వినిపించమని చెప్పడం వరకే ప్రభుత్వానికి హక్కు ఉంటుది. “కేసుని క్లోజ్ చేయండి మేము బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం” అనే అధికారం ప్రభుత్వానికి లేదు- అని ఆయన తన వాదన చెప్పారు.
‘‘ఎక్కడైనా కేసుని పిటిషనర్లు వెనక్కి తీసుకుంటారు. ప్రతివాదులకు (రాష్ట్ర ప్రభుత్వం) ఆ హక్కుఉండదు. ప్రభుత్వం బిల్లు వెనక్కి తీసుకోవడం వల్ల పిటిషనట్లు కోరుకున్నవి నెరవేరవు. కాబట్టి కేసు నడుస్తుంది. పిటిషనర్లు ప్రేయర్ మార్చుకునే వెసులుబాటు కూడా డిక్లరేషన్ ఫైల్ చేయడం ద్వారా వారికి ఉంటుంది. అందువల్ల కేసు నడుస్తూనే ఉంటుంది పిటిషనర్ల ప్రార్థనలు అన్నీ వారి అడ్వకేట్ వినిపించేదాకా కేసు విచారణ కొనసాగాల్సిందే అని రైతుల తరఫు న్యాయవాది వాదించారు.
మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించే బిల్లులో కూడా మూడు రాజధానుల మాటను ప్రస్తావించారు కాబట్టి.. విచారణ కొనసాగాల్సిందే అని కోరారు. మొత్తానికి ఈ బిల్లుల రద్దు ద్వారా జగన్ ఏం ఆశించారో గానీ.. హైకోర్టులో విచారణ మాత్రం పూర్తిగా ఆగిపోలేదు. వచ్చేనెల 27కు వాయిదా పడింది.
ముందే చెప్పుకున్నట్టు.. బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్టుగా తయారైంది జగన్ పరిస్థితి. ఆయన కలగని చేసిన చట్టాలు చచ్చిపోయాయి. కానీ.. వాటికి ముడిపెట్టి సాగుతున్న కోర్టు విచారణ మాత్రం ఇప్పుడే ఆగేలా కనిపించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Discussion about this post