తిరుమల తిరుపతి దేవస్థానం మరో వివాదానికి తెర తీసింది. ప్రస్తుతం ఉన్న రెండు కాలిబాటలు, రెండు ఘాట్ రోడ్డుల తో పాటు మూడో మార్గం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
వైఎస్ఆర్ జిల్లా కోడూరు సమీపంలోని బాలపల్లి అటవీ ప్రాంతం నుండి అన్నమయ్య నడచిన బాటను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ మేరకు శనివారం జరిగిన టిటిడి పాలక మండలిలో తీర్మానం చేసింది.
అయితే తిరుమలకు మూడో మార్గం సరైంది కాదని పలువురు విమర్శించారు. అలాగే తిరుమలకు రోప్ వే ఏర్పాటు చేయాలని గతంలో పాలకుల సంకల్పించారు. ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని చెప్పడంతో తాత్కాలికంగా ఆ నిర్ణయానికి బ్రేక్ పడింది. నేడు కడప జిల్లా నుండి తిరుమలకు మూడవ మార్గం ఏర్పాటు చేసేందుకు టీటీడీ సన్నద్ధం అవుతోంది.
అన్నమయ్య నడిచిన బాట ను కాలిబాట తో పాటు ఘాట్ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలని బోర్డు భావించింది. ఇందుకోసం పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అలిపిరి నుండి కాలి మార్గమైన, రోడ్డు మార్గమైన తిరుమలకు వెళ్లాలన్నది శ్రీవారి భక్తుల సెంటిమెంట్. అయితే తిరుపతి కి సంబంధం లేకుండా కడప జిల్లా నుండి తిరుమలకు కు మరో మార్గం ఏర్పాటు చేయడం భక్తుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెంటిమెంటును, ఆగమ శాస్త్రాలను గౌరవించి ఈ నిర్ణయాన్ని టిటిడి వెనక్కి తీసుకుంటుందా లేక మరో వివాదానికి తెర తీస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.
.
Discussion about this post