మానవ సంబంధాల మీద కథ వ్రాసుకుని పెద్ద బడ్జెట్ లో తీసిన నిర్మాతలను (సితార ఎంటర్ప్రైజెస్), దర్శకుడు వెంకీ ని అభినందించాలి. వెంకీ హ్యాట్రిక్ కొట్టాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రేక్షకుడిని సంతృప్తితోనే థియేటర్ నుంచి వెలుపలికి పంపుతుంది.

ఎందుకంటే కథలో కొంత కొత్తదనం ఉన్నా, ఈ సినిమాలో కొన్ని సంఘటనలు పాత సినిమాల్లో వచ్చినవే.
అయినా జనానికి బోరుకొట్టకుండా, పాత్రల వ్యక్తిత్వాలను బలంగా రాసుకోవడం, వాళ్ళు కూడా అంత బాగా నటించడం వలన ఈ సినిమా బావుంది. కొన్ని బలమైన సన్నివేశాలు మనల్ని కదిలిస్తాయి.
ముఖ్యంగా రాధిక, సూర్య మధ్య సన్నివేశాలు గుండెలకు హత్తుకుపోయేలా తీసాడు దర్శకుడు. అక్కడక్కడ మన కళ్ళు చెమరుస్తాయి కూడా. కథలో కొన్ని లోపాలు ఉన్నాయి సరోగసి టెక్ పాయింట్స్ దగ్గర, కానీ అవే్మీ మనల్ని ఆలోచించకుండా కథను నడిపించిన తీరు అభినందనీయం.
చాలా చోట్ల మంచి మంచి డైలాగ్స్ పడ్డాయి. ముఖ్యంగా మనకు మనుషుల మీద ముందున్న కోపం, ఆవేశం, కాలక్రమేణా అలిసిపోతాయి అని అర్థం వచ్చేలా వ్రాసిన డైలాగ్ బావుంది.
సినిమా నడక అక్కడక్కడ డౌన్ అవుతోంది అనుకోగానే మంచి సీన్స్ వచ్చి సినిమాని ఆద్యంతం ముందుకు
తీసుకువెళ్లాయి అనిపించింది.
ఇక నటన విషయానికి వస్తే
సూర్య సంజయ్ పాత్రని అర్థం చేసుకుని నటించిన తీరు అమోఘం, అతను ఎక్కడైనా ఆ బిగువును సడిలించి ఉంటే
మూవీ బోర్లా పడేది. అతను కాబట్టే మంచి నటనతో ఈ సినిమాని ఒక స్థాయికి తీసుకువెళ్ళాడు. అతని చిన్నతనం నుండి పెద్దయ్యేవరకూ ప్రవర్తన.. నిర్మించుకున్న వ్యక్తిత్వం, మానవ సంబంధాల్లో చెల్లి, పిన్ని (సవతి తల్లి) దగ్గర
తనను తాను సరిదిద్దు కోవడం చాలా బావుంది. అలాగే పూర్తి బాధ్యత తీసుకుని చివరివరకూ నిలబడ్డం ఈ పాత్ర బలం.
హీరో గొప్ప వాడు అతనిదే కరెక్ట్ అని చెప్పకుండా, సవతి చెల్లి, తల్లి వైపు వెర్షన్స్ విని హీరో మారడం చాలా బావుంది.
ఇతనే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్.
రాధిక సంగతి చెప్పక్కర్లేదు ఉన్నంతసేపు బాగా నటించింది. మరో ముఖ్యమైన పాత్ర హీరోయిన్ మమితబైజూ.. ఈమె చాలాకీ తనాన్ని, ఎమోషన్స్ ని భలే బాలన్స్ చేస్తూ నటించింది. చెప్పాలంటే కొత్తగా వస్తున్న (భాష ఏదైనా) హీరోయిన్స్ పాత్రలు బాగా అర్థం చేసుకుని భలే నటిస్తున్నారు. హావభవాలు బాగా పలికిస్తున్నారు. ఈమె కళ్ళతో నటించిన తీరు హ్యాట్సాఫ్. ఈ కథకు మరో పిల్లర్ కూడా ఈమె.
చివర్లో హీరోయిన్ ప్రేమించాను అని ఎంత చెప్పినా వినకుండా ఏజ్ గ్యాప్ విషయంలో రాసిన డైలాగ్స్ మరో బలం.
రవీనా టాండన్ కూడా ఉన్నంతలో బాగా నటింపచేసాడు దర్శకుడు. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బావుంది. కుటుంబ కథా చిత్రాల కోసం ఆవురావురమంటున్న ప్రేక్షకులకు ఈ సినిమా మంచి భోజనం. చాలా కాలం తర్వాత థియేటర్స్కి రప్పిస్తుంది. మితిమీరిన హింస, నరుకుళ్ళు, రక్త పాతం సినిమాలు చూసి విసిగి పోయిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని హాయిగా ఎంచుకోవచ్చు.
ఎందుకు మన హీరోలు ఈ మధ్య కుటుంబ కథల చిత్రాల వైపు రావడం లేదు? ఆలోచించుకోవాలి. తమిళ్ వెర్షన్ లో తీసిన డబ్బింగ్ సినిమా అయినా, ఆ వాసనలు కనబడకుండా తెలుగు వెర్షన్ బాగా తీశారు. కొన్నిచోట్ల లిప్ మూవ్మెంట్ సింక్ అవలేదు.
ఈ సినిమా చూసాక మంచి కుటుంబ కథలకు మన తెలుగు నటులు దూరం అవుతున్నారా? ఆలోచించుకోవాలి ఒకసారి. ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూసాము అని ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయే ఫీల్ గుడ్ మూవీ.
నెగటివ్ పాయింట్స్:
కొన్ని సీరియస్ సంఘటనలలో నాకు నచ్చని డైలాగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా హీరో నెలాఖరుకి బయటకి వెళ్లే
సందర్భం అనుచితం, అనిపించింది, కొంత క్యారెక్టర్ ఎసాసినేషన్ కూడా అయ్యింది అనిపించింది.
..చాగంటి ప్రసాద్
.