జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు వద్దే వద్దని జనసైనికులు గగ్గోలు పెడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరఫున కూడా అభ్యర్థులను మోహరించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ మేరకు ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కూడా. తాజాగా పార్టీ తెలంగాణ నాయకుడు శంకర్ గౌడ్ కూడా హైదరాబాదు ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఓ సమావేశం పెట్టుకుని.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని అందరికీ సూచించారు. జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో ఉంటారని కూడా ఆయన అన్నారు.
ఎటూ జంట నగరాల్లో జనసేన భాగస్వామి అయిన బీజేపీ చాలా బలంగానే ఉంది. ఈసారి బల్దియా ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ పనిచేస్తోంది. వారి భాగస్వామ్య పార్టీ అయిన జనసేన కూడా బరిలోకి దిగితే.. కచ్చితంగా వారికి ఎడ్వాంటేజీ ఉంటుంది. ఈ పొత్తు పోటీల వలన ఇటు జనసేన అభ్యర్థులకు, అటు బీజేపీ అభ్యర్థులకు కూడా లాభం ఉంటుంది.
అయితే కొత్తగా తెలుగుదేశంతో కూడా నగర ఎన్నికల్లో ఈ కూటమిలో భాగం కావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తల పట్ల జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశంతో పొత్తు వద్దే వద్దని జనసేనాని పవన్ కల్యాణ్‌కు మొరపెట్టుకుంటున్నారు.
ఇవీ చదవండి : తిరుపతి ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థి ఎవరో తెలుసా? మెగాస్టార్ నుంచి మనం నేర్చుకోవాల్సిన సరికొత్త పాఠం ఇది! నలుగురు తొడకొట్టనున్న బరిలో చివరకు నెగ్గేదెవరు?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆల్మోస్ట్ అయిపోయిందని, వారితో పొత్తు వల్ల వచ్చేలాభం లేకపోగా.. నష్టం తప్పదనే విజ్ఞప్తులు వస్తున్నాయి. పైగా సెంటిమెంటుగా కూడా తెదేపాతో వద్దని వాదిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో సర్వనాశనం అయిపోయిందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో ఏ కారణాల వల్ల పొత్తు పెట్టుకున్నా సరే.. ఇటు ఏపీలో కూడా.. తమ పార్టీ రెండు పార్టీలను సమానదూరంలో ఉంచి, ఇరువురి లోపాలపై సమానంగా చేస్తున్న పోరాటానికి విలువ లేకుండా పోతుందని కూడా వారు ఆందోళన చెందుతున్నారు.
అందుకే తెలంగాణలో- ప్రత్యేకించి బల్దియా ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంతో పొత్తు వద్దని, బీజేపీతో ఎటూ తాము భాగస్వాములే గనుక.. కలిసి పోటీచేయవచ్చునని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
.