ప్రపంచం యావత్తూ సెప్టెంబరు 16ను అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా పాటిస్తుంది. భూమండలానికి ముప్పు కలిగేలా పర్యావరణానికి మనం కలిగిస్తున్న హాని గురించి సదవగాహన పెంచుకోవాల్సిన తరుణం ఇది.
సృష్టిలో భూమి ఒక అందమైన ప్రదేశం. అందులో వివిధ రకాల జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, సరీసృపాలు, క్షీరదాలతో పాటు మనిషి కూడా మనుగడ సాగిస్తున్నాడు. అన్ని రకాల జీవులు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఇతర జీవుల మనుగడకు ఎంతగానో దోహదపడుతున్నాయి.
కానీ, మనిషి మాత్రం తన కర్తవ్యాన్ని విస్మరించి, వివిధ రకాల వికృత చేష్టలకు పాల్పడి పర్యావరణాన్ని పాడుచేస్తున్నాడు. తన స్వార్థంకోసం పచ్చని చెట్లను నరికేసి ప్రకృతి అసమతుల్యానికి కారణభూతుడయ్యాడు. అంతటితో ఆగకుండా సాంకేతికత పేరుతో ఊరూవాడా సెల్ టవర్లను నిర్మించడంవల్ల తద్వారా వచ్చే రేడియేషన్ వల్ల పక్షుల మనుగడే ప్రశ్నార్థకమైంది.దీనికితోడు ప్లాస్టిక్ ను అపరిమితంగా వినియోగించడంవల్ల క్యాన్సర్ భూతాన్ని తన నెత్తిమీదకు తెచ్చుకున్నాడు.
ఇలా మనిషి విపరీత ధోరణుల కారణంగానే వివిధ రకాల వైరస్సులు మృత్యురూపంలో మనిషిని కబళిస్తున్నాయి.
అందుకే…
ఇప్పటికైనా మనిషి మేల్కొనకపోతే ఈ అందమైన భూమి మీద ‘మనిషి’ అనబడే ఒక జంతువు ఒకప్పట్లో ఉండేదని ఇతర జీవరాశులు అనుకునే రోజులు వస్తాయి.
ఓజోన్ పొర అవసరం..
భూమి చుట్టూ కవచంలాగా ఉంటే అయిదు పొరల్లో రెండవది స్ట్రాటోస్పియర్. అందులో ఓజోన్ పొర ఉంటుంది. ఈ ఓజోన్ పొర సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత వికిరణాలను గ్రహిస్తుంది. ఇది పలచబడడం భూమండలానికి ముప్పు. ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలంటే.. భూమి మీద చెట్లు దండిగా ఉండాలి. ఆ స్పృహను అందరిలో కలిగించేందుకే, ఇవాళ, సెప్టెంబరు 16ను అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా పాటిస్తున్నారు.
చెట్లను నరికివేయడంవల్ల, ప్లాస్టిక్ ను అతిగా వాడడంవల్ల వాతావరణం కలుషితం అవుతుంది. తద్వారా అతినీలలోహిత కిరణాలను నుంచి భూమిని సంరక్షించే ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఓజోన్ పొర దెబ్బతింటే హానికరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని నేరుగా తాకుతాయి. ఆ కారణంగా రకరకాల వ్యాధులు ప్రబలుతాయి. అప్పుడు జీవరాశుల ఉనికికి ప్రమాదం వాటిల్లుతుంది.
కనుక…
ప్రతి ఒక్క మనిషి తనవంతు కృషిగా ఒక చెట్టును నాటడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించుకోవడాన్ని తక్షణకర్తవ్యంగా భావిస్తేనే భవిష్యత్తులో మనం పదికాలాలపాటు ఈ అందమైన భువిలో మనుగడ సాధించగలం.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
(అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం సందర్భంగా)
.