“ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శ్శక్తిః పరాక్రమః
షడేతే యత్ర తిష్టన్తి తత్ర దేవ స్సహాయకృత్ ”
ఉత్సాహం, సాహసం, ధైర్యం, సద్భుద్ది, శక్తి, పరాక్రమం — ఈ ఆరు సుగుణాలు ఎవరిలోఅయితే ఉంటాయో.. వారికి దేవుడు కూడా సహాయం అందిస్తాడు.
మన హైందవ ధర్మంలోని సుభాషితం ఇది. జీవన పథంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించగల కార్యశీలులు, మహనీయులు ఎలాంటి గుణసంపన్నులై ఉండాలో, సులక్షణ శోభితులై ఉండాలో తెలియజెప్పే సుభాషితం ఇది. అక్షరాలా.. మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ.. ఈ ఆరు లక్షణాలూ మూర్తీభవించినట్లుగా మనకు కనిపిస్తారు.
భారతదేశాన్ని ప్రపంచ దేశాల నడుమ తలెత్తుకుని నిలబడేలా తీర్చిదిద్దుతున్న.. యావత్తు ప్రపంచం భారత్ పట్ల నిబిడాశ్చర్యంతో పరికించి చూసేలా ఆవిర్భవింపజేసే కృషిలో.. అనుపమాన సంకల్పశుద్ధితో, అకుంఠిత కార్యదీక్షతో ముందుకు సాగుతున్న నరేంద్రమోడీ వ్యక్తిత్వంలోని వైశిష్ట్యాన్ని, బహుముఖ కోణాల్ని వివరించడానికి మనకు శక్తి చాలదు.
సుభాషితం ప్రవచించిన ఆరు లక్షణాలకు మాత్రం ఆయన స్పష్టమైన సత్యమైన నిత్యమైన నిదర్శనంగా కనిపిస్తారు.
అది ఎలాగో అవలోకిద్దాం…
ఉత్సాహం : నరేంద్రమోడీ ఇవాళ్టితో 71వ ఏడులోకి అడుగుపెడుతున్నారు. ఏడు పదులు నిండిన వార్ధక్యపు ఛాయలు ఆయనలో మచ్చుకైనా కనిపించవు. ఎంత చురుగ్గా, చలాకీగా ఉంటారో ఆయన నిత్యవ్యవహారాలను గమనించే ప్రతి ఒక్కరికీ తెలుసు. కార్యాలయ పనిభారంలో గడుపుతున్నా, బయట కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆయనలో ఉత్సాహం తరంగిస్తుంటుంది. పిల్లలతో పిల్లాడిలా, యువతతో యువకుడిలా కలిసిపోయే ఉత్సాహానికి ప్రతిరూపం మోడీ.

సాహసం : మోడీజీలో మనకు పుష్కలంగా కనిపించే లక్షణం ఇది. కొన్ని దశాబ్దాల పాటు.. యావత్ భారతదేశపు అస్తిత్వపు సమగ్రతను ప్రశ్నార్థకంగా మార్చిన జమ్మూ కాశ్మీరులోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. గతంలో ఎంతో మంది పాలకులు మారినా.. భారత అఖండత్వాన్ని పరిహసించే సదరు అధికరణం పట్ల వారిలో పలువురికి భేదాభిప్రాయం ఉన్నా.. దాని జోలికి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించనేలేదు. అలాంటిది నరేంద్రమోడీ తనలోని సాహసాన్ని నిరూపించుకున్నారు. కేవలం సాహసం ప్రదర్శించి.. 370ని రద్దు చేయడం మాత్రమే కాదు.. ఆ పని చేసినట్లయితే ఎలాంటి విపరిణామాలు యావత్ దేశాన్ని కుదిపేస్తాయని ఎంతో మంది గత పాలకులు ఆందోళన చెందారో.. అలాంటి బెడద ఏ ఒక్కటీ తలెత్తకుండా, దేశపు శాంతి సౌభాగ్యాలకు, స్నేహసౌహార్ద్రాలకు కించిత్ విపత్తు వాటిల్ల్లకుండా ఆయన సంబాళించగలిగారు.
ఇవికూడా చదవండి
సైదాబాద్ కిరాతకుడు రాజుది పోలీసు హత్యేనా?
రేపటి భవిష్యత్తుకు ఇవాళ్టి పునాది.. నరేంద్రమోడీ

ధైర్యం : ప్రపంచంలోనే ధైర్యానికి పర్యాయపదంగా నిలిచే విషయాల్లో బేర్ గ్రిల్స్ సాహసోపేత విన్యాసాల ‘మ్యాన్ వర్సస్ వైల్డ్’ కార్యక్రమం ఒకటి. ఈ దేశానికి గుండెకాయ లాంటి వ్యక్తి.. అది కూడా డెబ్భయ్యేళ్ల వయసులో బేర్ గ్రిల్స్ తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒప్పుకోవడమే.. ఆయనలోని అచంచల ధైర్యానికి సూచిక. ఆ కార్యక్రమంలో ఆయన ధైర్యం ఏ మోతాదులో కనిపించిందో అందరికీ తెలుసు.

సద్బుద్ధి : కరోనా సమయంలో ఆపన్నులకు అండగా నిలవడంలో మోడీ సర్కారు తీరు ప్రపంచ దేశాల్లోనే మార్గదర్శకంగా నిలిచింది. విదేశాలలో అలో లక్ష్మణా అంటూ ఇరుక్కుపోయిన వారిని సొంతగూటికి చేర్చడానికి వందేభారత్ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం దగ్గరినుంచి.. మనదేశంలోనే వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వారిని స్వస్థలాలకు పంపడం, కాలి నడకన స్వస్థలాలకు పయనమైన వారికి దారి పొడవునా సదుపాయాలు కల్పించడం వంటి సద్బుద్ధిని నరేంద్ర మోడీకి భగవంతుడు అనుపమానంగా ప్రసాదించాడు.

శక్తి : ద్వివిధాలైన శక్తిని.. ద్విగుణంగా, సహస్రగుణంగా భగవంతుడు నరేంద్రమోడీకి ప్రసాదించాడు. ఆయనకున్న శారీరక శక్తి గానీ, మానసిక శక్తిగానీ అపూర్వం. డెబ్భయ్యేళ్ల వయసులో కాలినడకన కొండలను అధిరోహించి, కొండగుహల్లో ఒంటరిగా నివసించి.. ఒక ఋషిలాగా కొన్ని రోజులైనా జీవించగల తెగువ ఎవరికి ఉంటుంది? శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచే దృష్టాంతాలు మోడీ జీవితంలో అనేకం.

పరాక్రమం : భారత భూభాగాలను దురాక్రమించుకోవాలని కుట్రపూరితంగా వ్యవహరించిన చైనాకు ఈ దేశానికి సారథ్యం వహిస్తున్న నరేంద్రమోడీలోని పరాక్రమం ఏమిటో తెలిసి వచ్చింది. ఆ పరిణామాల సందర్భంగానే.. నరేంద్రమోడీలోని పరాక్రమం, నిర్భీకత యావత్ భారత జాతికి కూడా మరోమారు తెలిసి వచ్చింది.

మనకు సుభాషితం చెప్పే ఆరు లక్షణాల సమన్వితమై, మూర్తీభవించినవ్యక్తే నరేంద్రమోడీ! ఈ దేశానికి భవిష్యపథనిర్దేశకుడు. అలాంటి సద్గుణ సంపన్నుడికి దేవతలు ఎప్పటికీ సహాయం చేస్తుంటారని మన సుభాషితం చెబుతుంది. అదే జరుగుతోంది.
ముక్కోటి దేవతలూ నరేంద్రమోడీ వెన్నంటి ఉండాలి. వారి కరుణా కటాక్షాలు ఆయనకు బలం కావాలి. ఆయనలోని సంకల్పానికి అండగా నిలవాలి. ఆయన ఈ దేశాన్ని ప్రగతి పథంలో మరింత ముందంజ వేయించాలి.
నరేంద్ర మోడీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
..
చంద్రప్ప
.

Discussion about this post