ఒకప్పట్లో దక్షిణాది యూత్, ప్రేమికులకు ఆరాధ్య హీరోగా.. అత్యంత వయొలెంట్ ప్రేమ చిత్రాలతో ఒక ఊపు ఊపిన కన్నడ నటుడు ఉపేంద్ర ఇప్పుడు సరికొత్త మాస్ అవతారంలో వెండితెరపై సందడి చేయబోతున్నారు.
అడపాదడపా మాత్రమే చిత్రాలు చేస్తున్నప్పటికీ.. అంతో ఇంతో మంచి పాత్రలను మాత్రమే ఎంచుకుని చేసే నటుడు ఉపేంద్ర ఈసారి ‘కబ్జా’ పేరుతో సరికొత్త చిత్రం చేస్తున్నారు. దక్షిణాది వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సమానంగా క్రేజ్ ఉన్న ఈ కన్నడ నటుడి చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతోంది. దీపావళి నాటికి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను పలకరిస్తుంది.
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా ఎస్ఎస్ఇ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వస్తున్న పాన్ ఇండియన్ సినిమా కబ్జా. దీనికి ఎంటిబి నాగరాజు సమర్పకులు. ఆర్ చంద్రు దర్శకుడుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి నిర్మాత.
ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. 1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న కబ్జా సినిమాలో పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు ఉపేంద్ర.
ఆయన లుక్ వైరల్ అయిపోయింది. చేతిలో కత్తి పట్టుకుని ఉపేంద్ర ఇచ్చిన పోస్ట్ అందర్నీ అలరిస్తోంది. రవి బసృర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కబ్జా చిత్రం టీజర్ దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
ఉపేంద్ర తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలతోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. కన్నడ రాజకీయాల్లో తన ముద్ర చూపించడానికి సొంత పార్టీ పెట్టి ప్రయత్నాలు సాగించారు గానీ.. ప్రజాదరణ దక్కలేదు. తిరిగి ఇప్పుడు సినిమాల్లోనే చురుగ్గా ఉన్నారు.
.