ధర్మరాజు అంటేనే ‘సకల ధర్మాచరణ పరాయణుడు’ అని మనం అనుకుంటాం. ఆయనకు తెలియని ధర్మం లేదని కూడా అనుకుంటూఉంటాం. అలాంటి ధర్మరాజుకు, భోజనప్రియత్వం, శరీరబలం తప్ప మరేమీ లేనివాడని మనం అనుకునే భీముడు ఏం నీతిని ఉపదేశించి ఉంటాడు?
ఇది సహజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే సరదాగా ఒక కథ చెప్పుకుందాం..
అనగనగా ధర్మరాజు చక్రవర్తిగా పాలన సాగిస్తున్న రోజుల్లో ఆయన వద్దకు ఓ పేద పండితుడు వచ్చి, ‘కష్టాల్లో ఉన్నాను సాయంచేయండి రాజా’ అని కోరాడు. అందుకు ధర్మరాజు ‘తప్పకుండా సాయం చేస్తాను. నువ్వు వెళ్లి రేపు ఉదయం రా’ అని అన్నాడు. ఆ మాత్రం హామీకే ఆ పేదవాడు ధర్మరాజును వేనోళ్ల కీర్తిస్తూ తిరుగుముఖం పట్టాడు.
ఆ సమయంలో సభలోనే ఉన్న భీముడు, ధర్మజుడు ఆ మాట చెప్పగానే కిసుక్కున నవ్వాడు. ధర్మరాజుకు అనుమానం కలిగింది. తమ్ముడు తన పట్ల తీవ్ర గౌరవాదరాలతో ఉంటాడే.. ఎందుకు నవ్వాడబ్బా అని సందేహం కలిగింది. ఆ నవ్వులో తనకు అవమానం కలిగించేది ఏమైనా ఉన్నదా అనే అనుమానం కూడా కలిగింది.
‘భీమా! ఎందుకు నవ్వావు’ అని అడిగాడు.
‘అన్నయ్యా నువ్వు చాలా గొప్పవాడివని నాకు తెలుసు. కానీ దేవుడికంటె, విధికంటె గొప్పవాడివని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్లూ నీలోని ఆ గొప్పదనం తెలియనందుకు నాకు నవ్వొచ్చింది’ అని చెప్పాడు భీముడు.
ధర్మజుడికి ఇంకా అనుమానం హెచ్చింది. అందులో ఏదో వెటకారం ఉందనిపించింది. అసలు అలా ఎలా అనిపించిందో కారణం వివరించి చెప్పాల్సిందే అని భీముడితో పట్టుపట్టాడు. దానికి భీముడిలా చెప్పాడు.
‘ఆ పేదవాడిని దానం కోసం రేపు రమ్మని చెప్పి పంపుతున్నావు. అంటే రేపటిదాకా నువ్వు ఖచ్చింతంగా ఉంటావని నీకు తెలుసు. విధి అంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలీకపోవడం. కానీ నీకు రేపటిదాకా ఉంటానని తెలుసు గనుక.. నువ్వు విధి కంటె గొప్పవాడినని నమ్ముతున్నావు! అందుకే నాకు నవ్వొచ్చింది’
భీముడి మాటలతో ధర్మరాజుకు సిగ్గేసింది. తన తప్పు తెలుసుకున్నాడు. దానం చేయదలచుకున్ననప్పుడు.. మంచిపని సంకల్పించినప్పుడు మరునాడు దాకా వాయిదా వేయడం నేరం అనుకున్నాడు. వెంటనే వెళ్తున్న పేద పండితుడిని వెనక్కు పిలిపించి, అతనికి సరిపడా దానం ఇచ్చి పంపాడు.
ఈ కథ మనకు ఒక మంచి పని చేయాలనుకుంటే తక్షణం చేసేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదని, పరిస్థితులు ఎలా వికటించి, ఎలాంటి పరిణామాలు వాటిల్లుతాయోననే భయం మనలో ఉండాలనే నీతిని చెబుతుంది. అచ్చంగా ఇలాగే కాకపోయినా.. ‘రేపు చేయాలనుకున్న పనిని ఇవాళే చేసేయి. ఇవాళ చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేసేయి’ అనే మాటను గాంధీ మహాత్ముడు ఒక ఉద్యమంలాగా ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు.
ఓ సుభాషితం కూడా ఇదే సంగతిని చెబుతుంది.
న కశ్చిదపి జానాతి కిం కస్య శ్వో భవిష్యతి ।
అతః శ్వః కరణీయాని కుర్యాతద్యైవ బుద్ధిమాన్ ॥
ఎవరికి ఏం జరుగుతుందో, రేపు అంటే భవిష్యత్తులో ఏమవుతుందో ఎన్నటికీ తెలియదు. అందువల్ల, బుద్ధిమంతుడు రేపు చేయాలనుకున్న పనులను ఈ రోజే ఇప్పుడే చేసేయాలి. అనేది శ్లోకభావం.
‘రేపటి పనిని ఇవాళే చేసేయాలి’ అనేది ఆదర్శం. అయితే.. ఆచరణకు వచ్చేసరికి ఆదర్శం చాలా కష్టం అవుతుంటుంది. చివరి నిమిషంలో గానీ పని చేయడానికి ఉడుకెత్తని తత్వం మనలో చాలావరకు ఉంటుంది.
ఆచరణలో పదేపదే విస్మరించినా, విఫలమైనా.. రేపటి పనిని ఈరోజే చేసేయాలనే ఆదర్శాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే దానివలన.. రేపటి పనిని ఈరోజు చేయకపోయినా సరే.. కనీసం, ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయని తత్వం అలవాటు అవుతుంది!
శుభోదయం.
ఇవి కూడా చదవండి :
మిత్రులకు ‘శుభోదయం’ సందేశాలు పంపడానికి సుభాషితాలు ఎంచుకోండి..
సినిమా ఇండస్ట్రీలో అరాచక విశృంఖలపోకడలపై సీనియర్ జర్నలిస్ట్ ‘రామ్’బాణం
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
.

Discussion about this post