కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయకపోవడం వల్లనే సమస్య.
సినిమాల్లో బాగా పేరు, డబ్బు సంపాదించేవాడా? జనం దేవుడిలా ఆరాధించేవారా? ‘ఆత్మగౌరవం’ అంటూ రంకెలేసి ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. అన్నా…అన్నా… అంటూ వెర్రి అభిమానులు, కులపోళ్ళు చుట్టూచేరారు. సరే, అధికారంలోకైతే వచ్చాడు. పొగిడితే పొంగిపోయాడు. కీర్తిస్తే ఖుషీ అయ్యాడు. ఆదర్శాలు కరిగిపోయే దాకా బాగానే సాగింది.
అడ్డగోలుతనం దరిద్రంలా ప్రవేశించింది. అయినోళ్ళను, కానోళ్ళను, కుళ్లుబోతోళ్లను, కుతంత్రంగాళ్లను నమ్మి చేరదీశాడు. తెలియని విద్యలో మతలబులు, కిటుకులు తెలియక చివరకు బొక్కబోర్లా పడ్డాడు. సినిమా క్లైమాక్స్ లో… వెనక్కి తిరిగి చూసేలోపే పదునైన కత్తి వెన్నులోపల దిగబడి వెనక నుంచి గుండెను తూట్లు తూట్లు చేసింది. అంత గొప్పోడికి అంత ఘోరమైన చావా?
కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయకపోవడం వల్లనే సమస్య.
జర్నలిజం అప్పట్లో ఒక పవిత్రమైన వృత్తి. విశాఖపట్నానికి పేపర్ ఆలస్యంగా వస్తుందని పత్రిక పెట్టాడు. ఉషోదయంలోపే పేపర్ గుమ్మంలో పడింది. తెలుగు భాష మంచిగా మారింది. కొత్త భాష జనాలకు ఎక్కింది. పేపర్ పవర్ తెలిసింది. కాసుల ఆశ పెరగడంలో తప్పులేదు. చిట్లు, పచ్చళ్ళు, కళాంజలులు, సినిమాలు వగైరా వగైరాలు వచ్చాయి. వృత్తిలో నలగకుండా ‘చీఫ్ ఎడిటర్’ అని పెట్టుకోరాదన్న హితవు పట్టకపోతే మానే!
పేపర్- కొమ్ములను సృష్టించింది. లిఫ్ట్ బాయ్ తో పేపర్ నడుపుతానన్నాడు. సంపద సృష్టిలో విజయం- కళ్ళను తల మధ్యలోకి తెచ్చింది. సరిగ్గా అదే సమయంలో మనోడు పార్టీ పెట్టాడు. ఇందులో ఒక అవకాశం కనిపించింది. ‘ఆత్మగౌరవానికి’ అక్షరం అండగా నిలిచింది. తెలుగుదేశం సూపర్ హిట్టయ్యింది. పవర్లో ఉన్నోళ్లు, పవర్ కోసం వెంపర్లాడే వాళ్ళు ఒంగి ఒంగి దండాలు పెడుతూ.. మన సూచనలు, సలహాలు, ఆదేశాల కోసం చూడ్డం. ఇదెంత సమ్మగా ఉంది! మనకు కావలసినప్పుడు సారా ఉద్యమం నడుపుతాం, వద్దనుకుంటే ఆపుతాం. ఏదైనా చెల్లిపోయింది. ఏదేమైనా.. రాజును భటుడిగా, భటుడ్ని రాజుగా చేయడంలో కిక్కే వేరబ్బా!
కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయకపోవడం వల్లనే సమస్య.
జర్నలిజం అంటే అదేదో తమకు సంబంధంలేని శుద్ధపూసలు పవిత్ర కార్యక్రమం అనుకున్న వాళ్లకు కూడా కొత్త బిజినెస్ ఫార్ములా అందివచ్చింది. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నాయి. మేకవన్నె పులుల దండు తయారయ్యింది. జనం బకరాలయ్యారు. ఒకడ్ని చూసి ఇంకొకడు మొదలేశాడు. పచ్చళ్ళ కన్నా మేము తీసిపోయామా? అని సారా వాళ్లు, బట్టలోళ్లు, సిమెంటోళ్లు, మెంటల్ గాళ్ళు రంగ ప్రవేశం చేశారు. పుణ్యం పురుషార్థమని ఈ వృత్తిలోకి దూకారు. ప్రొఫెషన్ కాస్తా బిజినెస్ రూపు దాల్చింది.
అప్పటికే జర్నలిజం మూసీ అయ్యిందనుకుంటే.. సత్యాన్ని పరిరక్షించే బృహత్ బాధ్యతను నెత్తికెత్తుకుని ఏకంగా రాజకీయ నాయకులే పత్రికలు పెట్టారు. మూసీ కాస్తా ట్యాంక్ బండ్ గా మారింది. క్విడ్ ప్రో కో నో, కీప్ క్వైటో ఏదో ఒకటి పెద్ద పెద్ద కార్పొరేట్ మీడియా హౌజ్ లు వెలిశాయి. ఇది చాలా బాగా వర్కవుట్ అయ్యింది పొలిటికల్‌గా. జర్నలిస్టుల జీతాలూ పెరిగాయి. అధికారంలోకి రావడానికి మీడియా సంస్థ పెట్టుకోవడం ఓల్డ్ స్టైల్. అధికారంలోకి వచ్చీ రాగానే, ఉన్న మీడియా సంస్థలను చేజిక్కించుకుని జర్నలిజం స్థితిగతులను మార్చడం, భజనపరులను ఎడిటర్లుగా పెట్టుకుని సత్యాన్ని శాసించడం న్యూ ట్రెండ్. తాజా విపరీత ధోరణులతో, పిచ్చి పోకడలతో జర్నలిజం చంకనాకి పోయింది.

కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయకపోవడం వల్లనే సమస్య.
అప్పటిదాకా కొద్దో గొప్పో సామాజిక స్పృహ ఉండే వాళ్ళను ఎంపిక చేసి జర్నలిస్టును చేసేవారు. నాణ్యమైన వాళ్ళు జిల్లాకొకరో, ఇద్దరో ఉండడంతో కాస్త విలువ ఉండేది. లిఫ్ట్ బాయ్ సూత్రం, వ్యాపార కాంక్ష, రాజకీయ ధ్యేయం మూలంగా మినీ ఎడిషన్స్ వెలిశాయి. మంగలి షాప్ వాడు కూడా మనకు చిన్నదో, చితకదో ప్రకటన ఇవ్వాలంటే ఇదే బెస్టని నమ్మారు. ఈ గబ్బు జబ్బు అన్ని పత్రికలకూ పాకింది. మనమెక్కడ వెనకపడతామోనని అంతా లోకల్ విలేకరులను పెట్టారు.
నాలుగు ముక్కలు రాసే ప్రతివాడూ విలేకరి అయ్యాడు. జనం ఎక్కువయ్యారు, మజ్జిగ పల్చనయ్యింది. ‘మనోళ్లకు’ పెత్తనం చేసే ముఖ్యమైన పదవులు ఇచ్చే సువర్ణావకాశం. డబ్బులు సరిగా ఇవ్వకుండా, కంట్రి బ్యూటర్, స్ట్రింగర్ అనే ముద్ర వేసి జనాల మీదకు వదిలారు. అందులో కొందరు కసిగా కోటీశ్వరులు అయ్యారు. రిపోర్టర్లే వ్యాపార ప్రకటనలు తెచ్చే సంప్రదాయం ఊపందుకుంది. జర్నలిజం ఇంకా గబ్బు గబ్బయ్యింది.
క్రమేణా టీవీ, సోషల్ మీడియా పెరిగాయి. బేవార్స్ పొలిటీషియన్, కరప్ట్ అఫీషియల్ ఈ లోకల్ కలం వీరుడి సంపూర్ణ సహాయ సహకారాలు కావాలంటే ఏమి చేయాలో అది చేసారు. పవిత్రమైన వృత్తి యైన జర్నలిజం కాస్తా పూర్తి స్థాయి ఫక్తు వ్యాపారంగా మారింది. ఈ పరిణామ క్రమంలో.. నికార్సైన జర్నలిస్టులు చావలేక బతుకుతున్నారు, కొంత మంది మొండికేసి చస్తున్నారు- ఈతి బాధలను తట్టుకోలేక.
జర్నలిజంతో ఫుట్‌బాల్, జర్నలిస్టుల జీవితాలతో చెడుగుడు ఆడి అప్పటిదాకా బాగా సంపాదించి ఆస్తుల మీద ఆస్తులు కూడబెట్టుకున్న మహరాజులు ఊహించని విధంగా రెండు విధాలుగా చెడారు. ఒక పక్క సోషల్ మీడియా శరాఘాతమై తమ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంటే కరోనా ఒక శాపంలా వచ్చిపడింది. ఇది అదనుగా భావించి యాజమాన్యాలు జర్నలిస్టులను వీధిన పడేశాయి. యజమాని సంపాదించిన ఆస్థులు, భూములు, వ్యాపార సామ్రాజ్యాల వెనుక తమ స్వేదం, రక్తం ఉన్నాయని గర్వపడే జర్నలిస్టులు.. గోడల మీద ఉన్న అతికించిన లిస్టు ప్రకారం కొన్నిరోజులు మాత్రమే ఉద్యోగానికి రావాల్సిన దుస్థితి.
ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
నయీమ్ ఇట్లో పాములు తేళ్ల పెంపకం.. ఎందుకో తెలుసా?
తమను, కుటుంబాలను, వృత్తిని ఇన్నాళ్లూ నమ్ముకున్న జర్నలిస్టులను ఆస్తులు అమ్మి అయినా ఆదుకోవాల్సింది పోయి… శారీరక, మానసిక, ఆర్ధిక ఇబ్బందులకు గురిచేయడం సైలెంట్‌గా జరిగిపోయింది. నిజానికి ఇది మానేజ్మెంట్ల ఘోరమైన నైతిక పరాజయం. మిడాస్ టచ్, కింగ్ మేకర్స్ అని భజన సంఘాల నుంచి కీర్తులు అందుకుంటూ మురిసే వీళ్లకు ఇట్లా చేసినందుకు నిద్ర ఎట్లా పడుతుందో కదా!
కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయకపోవడం వల్లనే సమస్య. పిచ్చి కుక్కలు, ఎడ్డి గాడిదల వల్లనే దుస్థితి!
అనేకానేక ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవాల్సింది పోయి జర్నలిస్టు యూనియన్ నాయకులు దారి తప్పారు. వృత్తి, గ్రిత్తి పక్కనబెట్టి పొలిటికల్ అజెండాలు నెత్తికి ఎత్తుకుని ఊరేగడంతో జర్నలిస్టుల సమస్యలు ఎత్తిచూపే నాధుడే లేకపోయాడు. మీడియా సంస్థలు బీభత్సకాండ సృష్టిస్తుంటే జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రభుత్వ పదవుల్లో ఖుషీగా సెటిల్ అయ్యారు. వృత్తిలో సమస్యల పరిష్కారం కోసం ఒకప్పుడు కనీసం నాలుగు మాటలైనా చెప్పిన నాయకులు ఇప్పుడు సర్కార్ వారి సేవలో తరించిపోవడం అధికమయ్యింది. పదవులపై ధ్యాసతో పాలిటిక్స్ చేస్తే మరింతే కదా, కామ్రేడ్!
ఇదొక ఎత్తైతే, ప్రభుత్వాలు నడిపే పత్రికలకు, ఛానల్స్‌కు అధిపతులుగా ఉన్న మాజీ సిన్సియర్ జర్నలిస్టులను చూస్తే జాలేస్తుంది. ఒక రెండు లక్షల కోసం ప్రభుత్వ పత్రికలో ఎడిటర్ హోదాలో చేరి… నిత్య నూతనంగా అధినేత భజన స్తోత్రాలు చేస్తూ నిజమైన సమస్యలను బాసుకు నొప్పికలగకుండా తెలివిగా సమాధి చేస్తున్న వైనం జుగుప్స కన్నా, ఆవేదన కలిగిస్తున్నది.
ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలకు భజన చేయాల్సిరావడం ఆగ్రహం కన్నా, అయ్యో.. అనిపిస్తున్నది. బతుకు పోరాటం కోసం ఇన్ని కతలు పడాల్సిరావడం ఎంత దైన్యమైన దుస్థితి!
ఈ విషాద, అవాంఛనీయ పరిణామాలతో జర్నలిజం ప్రతిష్ఠ మసకబారి నిజమైన జర్నలిస్టులు ఈ రొంపిలోకి వచ్చి ఎందుకు కూరుకుపోయాం రా భగవంతుడా… అని బాధపడుతున్న సమయంలో నోబెల్ బహుమతి వారు ఒక చల్లని కబురు చెప్పారు.
భావ ప్రకటన స్వేచ్ఛ కోసం అహరహం కష్టపడుతూ నిజమైన సమస్యలను ఎత్తి చూపుతూ ‘జర్నలిజం’ పవర్ ఏమిటో ప్రపంచానికి చాటుతున్న ఇద్దరు స్వతంత్ర జర్నలిస్టులకు (మరియా రెస్సా- ఫిలిప్పీన్స్; దిమిత్రి మురతోవ్- రష్యా) ఈ ఏడాది శాంతి బహుమతి ప్రదానం చేసారు. ఇది శుభవార్త.
జర్నలిజాన్ని పవిత్రంగా భావించే నికార్సైన జర్నలిస్టులు నిజంగానే శాంతి కాముకులు, అభివృద్ధి దోహదకులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, జన శ్రేయోకాంక్షులు.
ప్రజాస్వామ్యం, శాంతి పరిరక్షణకు భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమని నమ్మి, దాన్ని కలం ద్వారా సాహసోపేతంగా నిరూపిస్తున్నందునే ఈ ఏడాది శాంతి బహుమతి వీరిద్దరికీ ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించారు. “ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ నానాటికీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కుంటున్న ఈ ప్రపంచంలో ఆదర్శప్రాయమైన జర్నలిజానికి అండగా నిలిచే జర్నలిస్టులందరికీ వీరిద్దరూ ప్రతినిధులు” అని కూడా కమిటీ చెప్పింది.
సమాచార సేకరణ, వార్తా రచన, ప్రసారం- మూడూ ప్రజాస్వామ్యానికి, శాంతి సౌభాగ్యాలకు, సమసమాజ స్థాపనకు అంత్యంత కీలకమని ఈ వృత్తిలోని అందరూ- వీరిద్దరి స్ఫూర్తితో-మనసా వాచా కర్మణా నమ్మి ఆచరిస్తే బాగు.
..డాక్టర్ ఎస్ రాము
సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం బోధకులు
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

.

Discussion about this post