అంతర్జాతీయ పురుషుల దినోత్సవమైన నవంబర్ 19, 2021 నాడు దేశంలో ఇద్దరు బాగా తలపండిన రాజకీయ నాయకులు– 71 ఏళ్ళ నరేంద్ర మోడీ (నమో), 72 సంవత్సరాల నారా చంద్రబాబు నాయుడు (నానా)– దేశాన్ని కుదిపిన కుదుపు మామూలుది కాదు. ఆధునిక భారత చరిత్రలో ఒక మరిచిపోలేని రోజుగా ఇది మిగిలిపోతుంది- వివిధ కారణాల రీత్యా.
పొంతనలేని వాతావరణం, పోల్చలేని పరిస్థితుల మధ్యన మెన్స్ డే నాడు వీరి ప్రవర్తనలో ఒకే ఒక్క పోలిక: సహజమైన మొండి పట్టు శైలికి భిన్నమైన అనూహ్యమైన ప్రవర్తన. ‘నమో’ సారీ చెప్పడం, ‘నానా’ భోరున ఏడవడం ఇంతవరకూ ఎవ్వరూ చూడలేదు. ఇది కనీవినీ ఎరుగని విషయం, నమ్మశక్యంగాని పరిణామం. ‘నమో’ తెచ్చిన ఆనందం, ‘నానా’ కు వచ్చిన ఖేదం నేర్పే కొన్ని పాఠాలు ఉన్నాయి.
కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో క్రమంగా ఎదిగి, సహధర్మచారిణికి దూరంగా మెలిగి, 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఏడేళ్లుగా ప్రధానమంత్రిగా ‘నమో’ ఉంటే.. కేవలం భార్య మూలంగా దొరికి వచ్చిన నిచ్చెనను అందిపుచ్చుకుని రాజకీయ వైకుంఠపాళిలో అమాంతం ఎదిగి, పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక స్థాయికి చేరుకున్న నేత ‘నానా’. ఈ ఉత్థానక్రమంలో రాజకీయ వ్యూహాలతో అనేకానేక అపవాదులు, అపఖ్యాతులు, అపకీర్తులు మూటగట్టుకున్నా ప్రజలు వారిని ఆదరించి అందలం ఎక్కించారు.
స్వతంత్ర భారత చరిత్రలో ఘోరమైన ఘటనగా నిలిచిపోయే ముస్లింల ఊచకోతకు 2002 లో బాధ్యుడని విమర్శలు ఉన్నా ‘నమో’; రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మామ, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ను 1995లో పెద్ద రాజకీయ కుట్రలో వెన్నుపోటు పొడిచినా ‘నానా’ నిలదొక్కుకుని సమర్థంగా నెగ్గుకొచ్చారు. హిందూత్వ బలోపేతం అన్న సిద్ధాంతం అండతో తియ్యటి మాటల ‘నమో’, కమ్మ కుల ప్రాబల్యం అన్న ప్రధాన అజెండా దన్నుతో చిక్కటి వ్యూహాల ‘నానా’ రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు.
స్వార్థ కార్పొరేట్ శక్తులు, భావ సారూప్య మీడియా, తియ్యటి మాటలకు పడిపోయే-చిక్కటి వ్యూహాలకు చిక్కిపోయే కొన్ని వర్గాల ఓటర్లు వీరికి బలం, బలగం. ఎంతటి ప్రతికూల పరిస్థితినైనా చాకచక్యంగా ఎదుర్కొని తమకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకునే రాజకీయ చతురత వీరిద్దరి సొంతం. ఈ రాజకీయ ఉద్ధండులు తలవంచడం, మడమ తిప్పడం, మెట్టు దిగడంఅంత తేలిగ్గా జరిగేది కాదు.
వ్యవసాయం కార్పొరేటీకరణం ధ్యేయంగా జరిగినట్లు ప్రచారం జరిగిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 700 మంది రైతుల బలిదానంతో దాదాపు ఏడాదిగా రైతులు చేస్తున్న ఆందోళనకు ‘నమో’ దిగిరావడం విశ్వ వ్యాప్తంగా పెద్ద సంచలంగా మారింది. సిక్కుల మత గురువు గురు నానక్ జయంతిని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అయన రైతులకు క్షమాపణ చెబుతూనే చట్టాలను రద్దుచేస్తున్న గొప్ప నిర్ణయాన్ని ప్రకటించారు.
మోడీ వ్యక్తిత్వానికి భిన్నంగా వెలువడిన ఈ నిర్ణయాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి పత్రికలు ‘ఇన్ రేర్ షో ఆఫ్ వీక్నెస్.. మోడీ బౌస్ డౌన్’ అన్న శీర్షిక కింద కథనాలు వెలువరించాయి. ఈ నిర్ణయం మోడీ తీసుకున్నది- బలహీనతతోనా? బుద్ధిబలంలో విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించాలన్న సానుకూల మార్పా? అన్నది మున్ముందు తెలుస్తుంది.
తాము చెప్పింది వేదం, చేసింది శాసనం అన్న ‘నమో’ తరహా పాలకుల దుర్భ్రమను రైతన్నలు పట్టువీడని సుదీర్ఘ పోరాటంతో తుత్తునియలు చేయటం ముదావహం. పాలకుడు ఒక ప్రజాస్వామిక ప్రక్రియకు కంకణ బద్ధుడై ఉండకపోవడం, ఇతరేతర శక్తులకు ప్రయోజనాలు కలిగించాలన్న దురభిప్రాయంతో మెలగడం ఆమోదయోగ్యం కాదంటూ ఉత్తరాది రైతులు కదంకలిపిన తీరు అసాధారణం. మూడు చట్టాల్లో అన్నీ పనికిరాని ప్రొవిజన్స్ ఉన్నాయని ఎవ్వరూ అనలేరు గానీ, ప్రజాస్వామ్యంలో కీలకమైన చర్చ ప్రక్రియ అవసరమేలేదని గట్టిగా భావించి, సభాబలంతో వాటిని ఆమోదింపచేసిన తీరు ఆమోదయోగ్యంగా లేదు.
దీనికి తోడు, ‘అందోళన్ జీవులు’ అంటూ పాలక పక్షం వాగిన వాగుడు, రైతులపై ప్రదర్శించిన పశుబలం, రైతు నేతలపై చేసిన అఘాయిత్యాలు, మొత్తం ఉద్యమంపై ప్రయోగించిన కుయుక్తులు పారడంలేదని తెలిసి ప్రధానమంత్రి దిగివచ్చారు. తప్పులేదు.
కీలక రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అయినా సరే.. పీఎం దిగిరావడం సంతోషం. ఏదో మాటవరసకు కాకుండా, చిత్తశుద్ధితో, పూర్తి స్థాయిలో క్షమాపణ చెబితే బాగుండేది. ఏడాది పాటు జరిగిన ప్రాణ, ధన నష్టానికి రైతులకు పరిహారం ప్రకటించి ఉంటే ఇంకా బాగుండేది. నిజంగానే రైతులకు మేలు చేయదలిస్తే ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రైతుల భాగస్వామ్యంతో చట్టాలు తేవాలి తప్ప ఏకపక్ష నిర్ణయాలు పనిచేయవని గ్రహించాలి.
చట్టాల విషయంలో అంతే కఠినంగా వ్యవహరించిన అమిత్ షా కూడా సారీ చెప్పడం అంతే ముఖ్యం. బలప్రయోగం ద్వారా ఉద్యమాలను అణిచివేయలేమని అర్థమయ్యిందని మొహమాటం లేకుండా చెప్పడంలో తప్పులేదు. దీంతో పాటు, మోడీ-షా లను ప్రసన్నం చేసుకోవడం ధ్యేయంగా ట్వీట్లు కూసిన బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్స్, ఇతర మేథావులు కూడా తమ తాజా వైఖరిని పంచుకోవడం మర్యాద. ఏదిఏమైనా, కొత్త మోడీని దేశ ప్రజలు చూశారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం.
కొత్త చంద్రబాబు నాయుడు కూడా అదే రోజు కనిపించాడు. గుంభనంగా, పొడిపొడి మాటలతో, బిగబట్టుకున్నట్లు ఉండే అయన, విలేకరుల సమావేశంలో రెండు చేతులూ కళ్ళకు అడ్డుపెట్టుకుని, పెల్లుబుకుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వెక్కివెక్కి పిల్లవాడిలా ఆగకుండా ఏడవడం ఆయన్ను ఛీ కొట్టేవారికి కూడా ‘అయ్యో’ అనిపించింది.
అధికార పక్షం వారి ‘రన్నింగ్ కామెంట్రీ’ లో తన కుమారుడి జననం గురించి వచ్చిన ప్రస్తావనకు మనస్తాపం చెంది సభకు సమస్కారం చేసి.. ‘మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా’ అని శపథం చేసి బైటికి వచ్చిన ‘నానా’ కొద్దిసేపటి తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో వెక్కివెక్కి ఏడవడం మనం చూశాం.
పిచ్చి నేతల పచ్చి బూతుల గురించి నేను గతవారం రాసిన ‘పిచ్చినేతలు- తిక్కకూతలు- పచ్చి బూతులు’ వ్యాసంలో అంశాలే ఈ పరిణామానికి కారణమయ్యాయి. రాజకీయ ఉన్మాదం తో ఉభయ పక్షాలు చేసిన కామెంట్లు, ఒక మహిళకు పిల్లవాడు ఎప్పుడు పుట్టాడు? వంటి అసభ్య లెక్కలు కట్టడం మనకు సభ్యత కాదు. రాజకీయ ప్రత్యర్థిని కించపరచడానికో, మానసికంగా హింసించడానికో తన కుమారుడికి ఇపుడు డీఎన్ఏ పరీక్షలు జరపాలని కోరే కుసంస్కారులు, పిశాచుల గురించి రాయడం కూడా పాపమే.
‘నానా’ పాపం.. పత్తిత్తు అని అనలేం. సొంత గడ్డ కుప్పం స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఎక్కువ విచలితుడైనట్లు కనిపించింది. ప్రత్యర్థులు నేరుగా తన భార్య పేరు తేకపోయినా, అన్యాపదేశంగా అన్నదానిపై నానా యాగీ చేయడం కూడా బాగోలేదు. పదిహేను రోజుల నుంచి వల్లభనేని వంశీ ఇదే మాట విలేకర్లతో అన్నా.. గట్టిగా ఖండించకుండా.. ఇప్పుడు సభలో బైటా హడావుడి చేయడం ఎందుకు? బాలకృష్ణ నేతృత్వంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కలివిడిగా, జూనియర్ ఎన్టీఆర్ విడిగా ఈ పిచ్చి ప్రేలాపనల మీద స్పందించారు.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, మహిళలను కించపరిచే నీచ సంస్కృతికి ఆద్యుడు ఎవరు? సహాయంగా ఉంటుందని పెద్దాయన తనతో ఉంచుకుని, పద్ధతి ప్రకారం పెళ్లికూడా చేసుకున్న మహిళను ఘోరాతిఘోరంగా ఇంటా బైటా బద్నాం చేసి అనకూడని మాటలు అన్నది ఎవరు? తెలుగు రాజకీయ చరిత్రలో లక్ష్మీ పార్వతి పడిన క్షోభ, తమిళనాట జయలలితకు జరిగిన అవమానం రెండూ సమానమే కదా!
ఒక మహిళ కేంద్రంగా రాజకీయ పావులు కదిపి, ‘ఈనాడు’ లాంటి శక్తిమంతమైన మీడియా సహకారంతో ప్రజలను బురిడీ కొట్టించిన చంద్రబాబు ఇప్పుడు అనుభవిస్తున్నది నిస్సందేహంగా స్వయం కృతాపరాధం ఫలితం. మీ ఇంటి మహిళను సూచనప్రాయంగా అంటేనే ఇంత గుక్కపట్టి ఏడ్చారే, తన ఇంటి మహిళపై జరిగిన దాడికి ఎన్టీఆర్ ఎంత క్షోభ పడి పోయి ఉంటారో కదా! ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్లను, మోడీ ఇంటామెను చంద్రబాబు అనలేదా?
‘బొసఁడీకే’ అన్న బుద్ధిమాంద్యుడ్ని ఆపలేదేందుకు? జన సేన అధిపతి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ఎవరు ఎన్నిసార్లు మాట్లాడలేదు? వేరే వాళ్ళకో నీతి? తనకో నీతా? నాడు లక్ష్మీపార్వతిని అట్లా చేశారు కాబట్టి నేడు వీళ్ళ తిక్క కుదరాలనడం నా ఉద్దేశం కాదు. విష సంస్కృతి ఎప్పుడైనా విషతుల్యమైనదే, ఖండనార్హమే.
తమలపాకుతో తమరొకటిస్తే.. తలుపు చెక్కతో నే రెండిస్తా.. అని చెప్పి, చేసి చూపించే నాయకమ్మన్యులు ఉన్న కాలమిది. ఏది ఏమైనా, ఎవరు చేసినా ఈ తిట్ల సంస్కృతి, అందునా మహిళలను రొంపిలోకి లాగుతూ మాట్లాడడం మంచిది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దూషణ భూషణలు సభ్యసమాజం రోతతో, సిగ్గుతో, నిస్సహాయంగా తలదించుకునేలా ఉన్నాయి.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ప్రజలకున్న బోలెడు సమస్యలు పక్కన పెట్టి ఎన్నికలకు చాలాకాలం ముందే.. ఈ దారుణం ఏమిటి? ప్రజలెన్నుకున్న పార్టీకి ప్రతిపక్షం విధిగా గౌరవం ఇవ్వాలి, అలాగే విపక్షాన్ని అధికార పక్షం గౌరవించాలి.
అసలే ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేని కొత్త తరం ఓటర్లు నేతలను మరింత ఛీత్కరించుకుని పారిపోయే ప్రమాదం ఉంది. అధినాయకులను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నాయకులు సభ్యత సంస్కారం, ఉచ్ఛనీచాలూ మరిచి మాటల ఈటెలతో తెగ రెచ్చిపోతున్నారు. కొందరు మహిళా నేతల మాటలు శృతిమించాయి.
ఈ విషమ, క్లిష్ట పరిస్థితిని సరిదిద్దాల్సింది అధినేతలే. అధికారం ఇవ్వాళ ఉంటుంది, రేపు తన్ని తగలేస్తుంది. అశాశ్వతమైన అధికారంతో కన్నూ మిన్నూ కానరాకుండా వ్యవహరిస్తే రేపు మనకూ దీనికన్నా ఘోరమైన అవమానం ఎదురవుతుందన్న స్పృహ ఉండాలి. ఈ చిన్న సత్యాన్ని గ్రహించి అధినాయకులే జనహితం దృష్ట్యా చొరవ చూపి గతం గతః అని మంచి రాజకీయాలకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే, వీరు ప్రజాస్వామ్య ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు.
.. డాక్టర్ ఎస్. రాము
సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం బోధకులు

.

Discussion about this post