జిల్లాలో ఇటీవల కురిసిన బారీ వర్షాల వలన జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళేందుకు వివిద శాఖాధికారులతో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఉదయం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి , రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్పీ, ఎం.పీ , ఎం.ఎల్.ఎ, వివిద శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ పంచాయితీరాజ్ , ఆర్ అండ్ బీ , ఇరిగేషన్ అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామ స్థాయిలో జరిగిన నష్టాలను అంచనా వేయాలన్నారు. జిల్లాలో చిన్న నీటి వనరులు చాలా వరకు దెబ్బతిన్నాయని వాటికి మరమ్మత్తులు చేయడానికి వెంటనే నిధుల కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.
వ్యవసాయ శాఖ లో దెబ్బతిన్న వరి పంటను ఈ క్రాప్ చేయించి ఎన్యూమరేషన్ పక్కాగా చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో గల సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. ఇంకనూ చాలా గ్రామాలలో పంటలు, పశు నష్టాలు జరిగి ఉంటే తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని అన్నారు. పశుసంవర్థక అధికారులు వెటెర్నరీ అస్సిస్టెంట్ ల సహాయంతో గ్రామాలలో, హబిటేషన్ ల లో జరిగిన నష్టాలను అంచనా వేయాలన్నారు.
ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ ద్వారా నీటి రవాణా తగ్గించి పైపుల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం లో స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాలలో కొట్టుకపోయిన ప్రాంతాలను వెంటనే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు .
ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇటీవల కురిసిన బారీ వర్షాలకు జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా యంత్రాంగం చక్కగా స్పందించి ప్రజలకు సహాయసహకారాలు అందించారని , లోతట్టు ప్రాంతాలలో గల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి నీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముంపుకు గురై ఇళ్లలోకి నీరుచేరిన కుటుంబాలందరికీ కుటుంబానికి రూ.2 వేలు చొప్పున పైకం మరియు నిత్యావసర సరుకులు అందజేయాలని అన్నారు.
సమావేశంలో తొలుత జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివిద శాఖలలో చేపట్టిన చర్యలను, అంచనా వేసిన నష్టాన్ని వివరించారు. జిల్లాలో సరాసరి మొదట 113 మి.మీ రెండవ దఫా 188.9 మి.మీ వర్షపాతం నమోదు అయిందని దాదాపు 63 మండలాలలో 100 మి.మీలకంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు.
గత రెండు దపాలలో కురిసిన వర్షాలలో 1330 గృహాలు దెబ్బతిందని తెలిపారు. ఇప్పటివరకు 132 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 32,310 మందికి పునారావాసం కల్పించామని అన్నారు. ఇప్పటివరకు రెండు సార్లు కురిసిన వర్షాలలో ఆరు మంది చనిపోగా ఐదు మంది మిస్సింగ్ అన్నారు. చనిపోయిన వారికి ఒక్కొకరికీ రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లిచడం జరుగుతొందని తెలిపారు.
తిరుపతి ఎం.పీ. గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి పట్టణంలోకి నీరు రాకుండా శాశ్వతంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఇరిగేషన్ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, భవిష్యత్తులో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన బారీ వర్షాలకు అందరికంటే ఎక్కువగా తిరుపతి ప్రజలు నష్టాలను చూశారని 8 వార్డులలో దాదాపు 40 వేల మంది ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇంకనూ నీరు ప్రవహించే ప్రాంతాలలో నీటిని అరికట్టేందుకు మరియు నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం మాట్లాడుతూ ఎక్కువగా ఎస్సీ కాలనీలలో ముంపుకు గురైన కుటుంబాలు ఉన్నాయని , వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అన్నారు.
మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా మాట్లాడుతూ పుంగనూరు – మదనపల్లి హైవేలో గల రోడ్డులను సర్వే చేయించి దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తులు చేయించాలని అన్నారు.
పూతలపట్టు శాసనసభ్యులు ఎం.ఎస్.బాబు మాట్లాడుతూ పూతలపట్టు, అరగొండ, బంగారుపాలెం, ఐరాల ప్రాంతాలలో చాలా వరకు చెరువులు, రోడ్లు కు నష్టం వాటిల్లిందని, వెంటనే తాత్కాలిక పునరుద్ధరణ చేపట్టాలని అన్నారు.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూధన రెడ్డి మాట్లాడుతూ స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతంలో ఇసుక చాలా చేరిందని, రైతులకు అరటి పంట బాగా దెబ్బతిందని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బారీ వర్షాల వలన జిల్లా యంత్రాంగం చొరవతో జిల్లాలో ప్రాణ నష్టం పెద్దగా జరగలేదని తెలిపారు.
ఈ సమావేశంలో సంబందిత అగ్రికల్చర్, ఉద్యాన, పశు సంవర్థక , ఇరిగేషన్, పంచాయితీ రాజ్, ట్రాన్స్కో శాఖాధికారులు వారి శాఖలలో జరిగిన నష్టాల వివరాలను వివరించారు.
.