ఎక్కడి నంబాకం- ఎక్కడి ఉగాండా? ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఎంత? రెండు ప్రాంతాల వారికి ముడి ఎలా పడుతుంది. అంతా అంతర్జాలం మహిమ. అలాగని.. ఇలా రెండు వేర్వేరు ప్రాంతాల వారి భూమికతో ఒక క్రైం జరిగిందని అనగానే.. లవ్ అని మనం అనుకుంటాం. కానీ.. ఇక్కడ మాత్రం చీటింగ్. పెద్ద నగరాల్లో పెద్ద చేపలకు వేసిన వలకాదు ఇది. మారుమూల పల్లెటూరు యువతికి కుచ్చుటోపీ పెట్టిన వైనం.
నంబాకం అంటే చిత్తూరు జిల్లా నగరి మండలంలోని ఒక మారుమూల పల్లెటూరు! ఈ గ్రామంలోని ఓ మామూలు యువతి.. అంతర్జాలం మాయలో పడింది. ఆన్ లైన్ లాటరీ వచ్చిందనేసరికి.. మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. నంబాకం గ్రామానికి చెందిన యువతిని తెలివిగా మోసగించిన కేసులో ఉంగాండాకు చెందిన నేరస్తుడు ‘నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్’ అనే వ్యక్తిని చిత్తూరు జిల్లా పోలీసులు ఇంకా తెలివిగా వ్యవహరించి అరెస్టు చేశారు.
సిటీల్లో ఇలాంటి ఆన్ లైన్ మోసాలు కోకొల్లలుగా జరుగుతుంటాయి. సంపన్నుల ఖాతాలను పరిశీలించి ఆన్‌లైన్ కేటుగాళ్లు ఎరవేస్తుంటారని అనుకోవచ్చు. కానీ.. ఇంత మారుమూల ప్రాంతాల్లో మోసం చాలా అరుదు! ఏడాది కిందట ప్రారంభమైన మోసానికి.. తాజాగా అరెస్టుతో తెరపడింది.
2020 అక్టోబర్‌లో ఆన్‌లైన్ లాటరీలో 2.5 కోట్లు వచ్చాయని నంబాకం యువతికి జాన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ సొమ్ము తీసుకోవాలంటే.. ముందు ప్రాసెస్ నడిపించడం కోసం కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.
నంబాకం యువతి ఆ బుట్టలో పడింది. మొదట రూ.3.5 వేలు, తర్వాత రూ.12.5 వేలు, దశలవారీగా రూ.13,78,890 వరకు ముట్టజెప్పింది. చిన్న పల్లెటూరులోని మామూలు యువతి ఆమె. బ్యాంకు ఖాతాల్లో లక్షలు మెయింటైన్ చేస్తున్నది కాదు. బంగారం, ఇల్లు, పొలం కుదువబెట్టి డబ్బు సమకూర్చింది. అత్యాశ ఆమెతో అన్ని పనులూ చేయించింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి ఆత్మహత్యకు యత్నించింది. ఇక్కడినుంచి నగరి పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు.
చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్, పుత్తూరు డిఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. నగరి ఇన్స్పెక్టర్ మద్దయ్యచారి ఆద్వర్యంలో ఢిల్లీ పోలీసుల సహకారంతో నిందితుడి నివాసం పై దాడి చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు. విచారణ కోసం ఢిల్లీ నుండి ట్రాన్సిట్ వారెంట్ పై చిత్తూరుకు తరలించారు.
నగరి పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి.. నిందితుడి ఆనుపానులు రాబట్టారు. పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్లగా.. ఇంటిగేటు తీయలేదు. దీంతో సినిఫక్కీలో ఇంటిగేటును గ్యాస్ కట్టర్‌లతో తొలగించి అరెస్ట్ చేసినట్లు చిత్తూరు పోలీసులు వెల్లడించారు. మొత్తానికి మోసగాడు ప్రస్తుతం కటకటాల వెనక్కి చేరాడు.
నరసింహ సినిమాలో తలైవా రజనీకాంత్ చెబుతాడు. అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు.. అని! నిజానికి ఆడ మగ తేడా లేదు. అతిగా ఆశపడినా, అతిగా ఆవేశపడినా సుఖపడడం చరిత్రలో ఎప్పటికీ ఉండదు!
Also Read : మంచితనం నిరూపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన
ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరుట!
చంద్రబాబు కన్నీళ్లు ఆయనకు మేలు చేస్తున్నాయా? నిజమేనా?
మగాళ్ల దినోత్సవం రోజున మోడీ వెనక్కి తగ్గితే, చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు
.

Discussion about this post