దేశంలోని మహిళాలోకం మొత్తం అరారియాలోని పోక్సో కోర్టు న్యాయమూర్తికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. థాంక్స్ చెప్పాలి. ఆ జడ్జిగారు వ్యవహరించిన విధంగా అందరూ గనుక తీర్పులు చెబితే.. ఈ దేశంలో ఇక రేప్‌లు జరగవు. కనీసం రేప్ చేయాలనే ఆలోచన పుట్టగానే.. దాని వెన్నంటి భయం కూడా పుడుతుంది. అన్యాయానికి, అత్యాచారానికి గురయ్యే వర్గానికి న్యాయవ్యవస్థ తమకు తోడుగా ఉందనే నమ్మకం కూడా పెరుగుతుంది. అందుకే న్యాయమూర్తి శశికాంత్ రాయ్ కు ఇప్పుడు అందరూ అభినందనలు చెప్పాలి.
Justice delayed is justice denied అనేది న్యాయసూత్రం. న్యాయస్థానాల్లో తీర్పు చెప్పడం ఆలస్యం అయితే.. వారికి న్యాయం దక్కనే దక్కదు- అనేది సూత్రం. ఈ నేపథ్యంలో- అరారియా పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పు.. న్యాయస్థానాల్లో విపరీతమైన జాప్యం జరుగుతూ ఉంటుదనే విమర్శలను తరచూ చేస్తుండే వారి నోటికి తాళం వేస్తుంది. అవసరమైన సందర్భాల్లో నేరస్తులకు వెన్నులో వణుకు పుట్టేలాగా మామూలు వేగం కాదు, జెట్ స్పీడుతో విచారణ పూర్తి చేసి శిక్ష వేసేయడం కూడా అయిపోయింది.
వివరాల్లోకి వెళితే..
బీహర్లోని అరారియా జిల్లా పరిధిలో ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఎనిమిదేళ్ల పసివయసులోని చిన్నారిని ఓ కామాంధుడు చిదిమేశాడు. మరురోజే కేసు రిజిస్టరు అయింది. పోలీసులు కూడా త్వరగానే దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
సుమారు రెండు నెలల తర్వాత.. అక్టోబరు 4వ తేదీన కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్- ఉభయపక్షాల నుంచి వాదనలు విన్నారు. అలాంటి నరరూప రాక్షసుడికి శిక్ష విధించడానికి ఆయనకు ఎక్కువ సమయం అవసరం లేకుండాపోయింది. వాదనలు పూర్తయిన వెంటనే.. న్యాయమూర్తి శశికాంత్ రాయ్.. నిందితుడికి శిక్ష వేసేశారు.
అంతే.. కేవలం ఒక్క రోజులోనే.. వాదనలు వినడమూ, శిక్షవేయడమూ కూడా జరిగిపోయంది. నిందితుడికి యాభై వేల జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. అత్యాచారానికి గురైన బాలికకు ఏడులక్షల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు.
నిజానికి అక్టోబరు 4నే విచారణ-తీర్పు జరిగింది గానీ.. న్యాయమూర్తి శశికాంత్ రాయ్ ప్రచారం కోరుకున్నట్టు లేదు. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశంలోనే ఒక్కరోజులో కేసు విచారణ పూర్తి చేసి.. శిక్ష కూడా పడడం అనేది.. ఇదే ప్రథమం అయి ఉంటుందని అందరూ శశికాంత్ రాయ్ ను ప్రశంసిస్తున్నారు. ఇంతవేగంగా శిక్షలు వేస్తోంటే.. నేరాలు చేసే వారూ భయపడతారని అందరూ అంటున్నారు.
.