అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండు చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 37వ రోజైన మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది.
శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్దకు అమరావతి రైతులు చేరుకోగానే చిత్తూరు జిల్లాకు చెందిన రైతులు, టీడీపీ, బీజేపీ, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు వందలాది మంది స్వాగతం పలకడానికి తరలి వచ్చారు.
జగ్గరాజుపల్లె వద్ద కొంతమంది రైతులు, నేతలు మోకాళ్లపై కూర్చుని వందనం చేస్తూ పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు స్వాగతం పలికారు. జై అమరావతి… జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె నుంచి సుమారు 16 కి.మీ. దూరంలోని ఏర్పేడు మండలం చింతలపాళెం వరకు చేస్తారు.
రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం ఎంపేడు వద్ద అమరావతి రైతులకు భోజన ఏర్పాట్లు చేశారు. భోజన ఏర్పాట్లు చేసే ప్రాంతంలో చదును చేసిన భూమిని… గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాల సాయంతో దున్నేశారు. దీంతో మొదటి ఎంఫిక చేసిన స్థానంలో కాకుండా… వేరే చోట భోజన ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
కాగా శ్రీకాళహస్తి మండలంలో పాదయాత్ర చాలా ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగణమ్మ, టీడీపీ జిల్లా కన్వీనరు పులివర్తి నాని, శ్రీకాళహస్తి నియోజక వర్గ టీడీపీ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, టీడీపీ నేతలు చెలికం పాపిరెడ్డి, తాటిపర్తి రవీంద్రనాథరెడ్డి, చెంచయ్యనాయుడు, చక్రాల ఉష, విజయకుమార్, కంఠా రమేష్, కామేష్ యాదవ్, పొన్నారావు. రెడ్డివారి గురవారెడ్డి, హరిక్రిష్ణ నాయుడు, మోహన్ క్రిష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఇబ్బందులు పెట్టడం బాధాకరం
శ్రీకాళహస్తి మండలంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి స్థానిక శాసససభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ప్రయత్నించడం బాధాకరమని నియోజక వర్గ టీడీపీ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పాదయాత్ర చేసే రైతులకు ఎంపేడు వద్ద భోజన వసతి ఏర్పాట్లు చేస్తుంటే చదును చేసిన స్థలాన్నివైసీపీ నేతల చేత దున్నేయించారన్నారు. ఇలా చేయడం వారి దౌర్జన్యానికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. ప్రజలే వీరికి బుద్ధి చెప్పాలన్నారు. ఇక అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని 700 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నా జగన్ ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోక పోవడం బాధాకరమన్నారు.
ఏపీకి రాజధాని ఏదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి కోసం రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే జగన్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి అడ్డంకులు సృష్టిస్తోందని సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా… మొక్కవోని దీక్షతో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు ఆయన అభినందనలు తెలియచేశారు. రాష్ట్ర ప్రజలందరూ వీరి ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు.
.