మల్టీస్టారర్.. గత కొన్ని నెలలుగా చెవులు మారిమోగిపోతున్న పదం! ఇప్పటి సినిమా పిచ్చోళ్లకు ఇది కొత్త కావచ్చేమో గానీ.. 70ల తర్వాత పుట్టిన మాలాంటోళ్లమైతే బహుశా వీటితోనే పెరిగామేమో అనిపిస్తుంది..
తెరనిండా ఇద్దరు తారలు కనిపిస్తుంటే చూడ్డం అనేది ఆ రోజుల్లో మామూలే. అంతకు ముందొచ్చిన గుండమ్మ కథ, మాయా బజార్ లాంటి సినిమాలను.. 70ల మొదట్లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం, దేవుడు చేసిన మనుషులు, చాణక్య చంద్రగుప్త లాంటి వాటిని పక్కనపెడితే.. తెలుగులో నాకు తెలిసి అసలు సిసలు మల్టీస్టారర్ అని అందరికీ అనిపించింది మాత్రం రామకృష్ణులు..
1978లో వచ్చిన ఈ సినిమా తర్వాత ఇలాంటి ట్రెండ్ మొదలయ్యిందనే చెప్పచ్చు. అంటే ఇద్దరు స్టార్లకు తెరను చెరీ సగంగా పంచేయడం.. చెరో ఫైట్, చెరో పాట.. ఇద్దరికీ కలిపి ఒకపాట, క్లైమాక్స్‌లో ఇద్దరూ కలిసి విలన్ల భరతం పట్టించడం.. హీరోల అభిమానులు పుసుక్కుమని ఫీలైపోకుండా.. ఎంజాయ్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ ఫార్ములా. ఇక వారికి తోడు పక్కనే జయసుధ, జయప్రద లాంటి టాప్ హీరోయిన్లు కూడా ఉంటారు కదా.. అందుకే తెరమీద పండగే!
అప్పట్లో రిక్షా పుల్లర్ కూడా సాయంత్రం వరకూ పనిచేసినా హాయిగా ఫస్ట్ షో చూసి సేద తీరుదాం అనుకునే రోజులు. అందుకే ఒకే టికెట్టుకు ఇద్దరు స్టార్లు తెరమీద కనిపిస్తుంటే.. అందరూ థియేటర్లకు పోటెత్తడం గ్యారంటీ అనే ఒక బిగ్గర్ పిక్చర్. అందుకే వీబీ రాజేంద్ర ప్రసాద్ తన రెగ్యులర్ హీరో ఏఎన్నార్‌తో కలిపేసి ఎన్టీఆర్‌తో మొదటిసారి సినిమా తీశారు. ఒక హిందీ సినిమా స్ఫూర్తితో.. తెలుగులో తొలి ఇద్దరు స్టార్లకు ఒక సినిమాను పంచేశారు.
సాధారణంగా ఇలాంటి కథలుంటే డ్యుయెల్ రోల్స్ చేస్తూ వచ్చిన హీరోలకు ఇది కొత్త కిక్ ఇచ్చింది. అసలు సిసలు మల్టీస్టారర్స్ అప్పటినుంచే మొదలయ్యాయనిపిస్తుంది. తర్వాత దర్శకులు, నిర్మాతలు చాలా మంది ఇదే ట్రెండ్ కంటిన్యూ చేశారు. ఇద్దరు స్టార్ల కథలు రాసుకుని.. ఆ కథను, ఫైట్లను, పాటలను అన్నీ తూకమేసి మరీ పంచేసి తీయడం మొదలెట్టారు. అప్పుడు ఈ ట్రెండ్‌కు కారణమైన స్టార్ సూపర్ స్టార్ కృష్ణ.
సీనియర్లు ఏఎన్నార్, ఎన్టీఆర్ల నుంచి తన తరం హీరోలు కృష్ణంరాజు, శోభన్‌బాబు, రజనీకాంత్, ఇంకా ఎంతో మంది హీరోలతో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు కృష్ణ. 77లో వచ్చిన కురుక్షేత్రంలో శోభన్‌బాబు, కృష్ణంరాజుతో సినిమా చేసినా.. ఏఎన్నార్‌తో చేసిన హేమాహేమీలు నుంచి కృష్ణ రియల్ మల్టీస్టారర్స్ హవా మొదలైంది.. అంటే ఈక్వల్ స్క్రీన్ షేరింగ్..
శోభన్ బాబుతో కలిసి మండేగుండెలు, కృష్ణార్జునులు, ముందడుగు, మహా సంగ్రామం, ఇద్దరు దొంగలు.. కృష్ణంరాజుతో కలిసి అడవి సింహాలు, యుద్ధం లాంటి సినిమాలతోపాటూ సీనియర్లు ఎన్టీఆర్‌తో వయ్యారి భామలు వగలమారి భర్తలు, ఏఎన్నార్‌తో గురుశిష్యులు లాంటి సినిమాలు వరుసగా చేశాడు కృష్ణ. అంటే ముఖ్యంగా ఈ సినిమాలన్నీ ఇద్దరు హీరోలు సినిమాను సగం సగం పంచుకున్నట్లు ఉంటాయి.
ఆ తర్వాత కథలతోపాటూ అలాంటి సినిమాల ట్రెండ్ కూడా మారింది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వరకూ మల్టీస్టారర్ అనే పదం పెద్దగా వినిపించలేదు. కానీ ఆ సినిమా గానీ, ఆ తర్వాత వచ్చిన బాహుబలి, గోపాల గోపాల, దేవదాస్, మసాలా లాంటి సినిమాలను మల్టీ స్టారర్స్ అని చెప్పారు.
కానీ గమనిస్తే ఈ సినిమాల్లో సీనియర్, జూనియర్ లేదంటే.. టాప్ హీరో, యంగ్ హీరో.. అనే ఒక సన్నటి గీత కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు అంతకు ముందు కూడా చాలా వచ్చాయి. ఎన్టీఆర్, బాలకృష్ణ, ఏఎన్నార్, నాగార్జున, కృష్ణం రాజు-చిరంజీవి లాంటి వారు సినిమాలు చేశారు. కానీ అందులో పాత తరం, కొత్త తరం హీరోలు కలిపి క్యాష్ చేసుకోవాలనే తపన, దానికి తగ్గ స్టోరీలు క్లియర్‌గా కనిపించేవి..
ఒక విధంగా ఇంతకు ముందు వచ్చిన ఎస్వీఎస్సీ, గోపాలగోపాల కూడా అలాంటివే.. అవి కథ ప్రకారం నటించినవి.. త్వరలో రాబోయే మల్టీస్టారర్‌గా చెబుతున్న బీమ్లా నాయక్ లాంటివి కూడా ఇలాంటి సినిమానే.
కానీ చాలా రోజుల తర్వాత అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు మల్టీస్టారర్ జమానా తర్వాత ఇన్నాళ్లకు రియల్ మల్టీస్టారరేమో అనిపిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్.
ఈ సినిమా గురించి మొదట చెప్పినపుడు బాక్సింగ్ నేపథ్యం అన్నారు.. అప్పటి నుంచే ఈ సినిమాపై అటు చెర్రీ, ఇటు తారక్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి యువతరం హీరోలు, ఒడ్డూపొడుగుతోపాటూ ఇంచుమించు ఒకే ఏజ్, క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్లు తలపడుతుంటే చూడాలని తహతహలాడిపోయారు.
దానికి తగ్గట్టే రాజమౌళి కూడా ఈ సినిమాపై క్రేజ్ బిల్డప్ చేస్తూ వచ్చాడు. కథ పీరియాడిక్ అయినా టైటిల్స్‌తో సహా ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇస్తూ.. మా హీరోలు నీరు, నిప్పు అని చూపిస్తూ ఒకరిని ఆంధ్రా అల్లూరిగా, ఇంకొకరిని తెలంగాణ కొమరం భీమ్‌గా చూపిస్తూ ఇద్దరు హీరోల అభిమానులనే కాదు.. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు అభిమానులను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించాడు..
ఇద్దరి గురించి విడివిడిగా విడుదలైన టీజర్లు.. క్యారెక్టర్ డిజైన్‌ను పీక్‌లో చూపించాయి. వాటి ద్వారా తన సినిమాలో ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందని చూపించాడు రాజమౌళి. నాటు నాటు పాటతో.. ఒకే స్టైల్ డ్రెస్సులు, స్టైల్‌తో ఇద్దరూ స్టెప్పులేయడం చూడగానే ఇప్పటోళ్లకు ఏమోగానీ.. మాలాంటి వాళ్లకు ఆనాటి స్టార్లు ఒకే డ్రెస్సులతో పాటలు పాడుతూ స్టెప్పులు వేసిన సినిమా రీళ్లన్నీ వరసగా గుర్తొచ్చేశాయ..
ఇప్పుడు.. ఆ టెంపో సినిమాలోనూ కంటిన్యూ అవుతుందా లేదా అనేదే డౌట్. అలనాటి మల్టీస్టారర్లో ఉన్నట్టు ఇద్దరు హీరోల మధ్యా ఫైట్ ఉండచ్చేమో.. కానీ కథలో ఇద్దరికీ సమాన భాగం ఇస్తూ ఇద్దరు అభిమానులను సంతృప్తి పరచగలడా అనే చిన్న సందేహం ఉంది. పీరియాడిక్ కథ, స్వాతంత్ర్య సమరయోధుల టైప్ కాబట్టి.. ఇద్దరిలో ఒక హీరో చనిపోవచ్చేమో.. లేదా దేశం కోసం ఇద్దరూ చచ్చిపోతారేమో.. అనే అనుమానం కూడా ఉంది..
కరోనా కష్టాల వల్ల ఆర్ఆర్ఆర్ విడుదల లేటయ్యేసరికీ దీనిమీద అభిమానుల్లో, తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.. కథ ఏంటి అనేది ఇప్పటికే చూచాయగా తెలిసిపోయినా.. టీజర్లలో ఇద్దరు స్టార్లూ కలిసి కనిపించేలా, సందడి చేసేలా లేదా పులుల్లా గర్జించే… ఆ కొద్ది కొద్దిగా వడ్డించిన సన్నివేశాలు బిగ్ స్క్రీన్‌పై… పూర్తిగా ఎలా ఉంటాయనే ఉత్కంఠ ఎప్పటికి తీరుతుందో. కొన్ని దశాబ్దాల తర్వాత.. అసలు సిసల్ మల్టిస్టారర్ మజాను ఎప్పటికి ఆస్వాదిస్తామో!?
.. లహరి
.

Discussion about this post