డప్పు రమేష్ గా జనంలో ప్రాచుర్యం పొందిన జననాట్యమండలి కళాకారుడు ఎలియాజర్ కొద్ది సేపటి క్రితం విజయవాడ ఆంధ్రాహాస్పటల్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయన స్వగ్రామం తెనాలి దగ్గర అంగలకుదురు గ్రామం.
1982 ప్రాంతాల్లో.. తెనాలి విఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే అప్పటి రాడికల్ యువజన సంఘం కార్యదర్శి వర్ధనరావుగారి ప్రభావంతో రాడికల్ విద్యార్ధి సంఘంలో చేరారు రమేష్.
ఆ తర్వాత ఆయనలో ఉన్న కళాకారుడు జననాట్యమండలి వైపు నడిపించాడు. గుంటూరు జననాట్యమండలి టీమ్ పేరుతో రమేష్ , కుమారి, దివాకర్, సత్యం కలసి అనేక వేల సాంస్క్రుతిక కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రమంతటా ఇచ్చారు.
పీపుల్స్ వార్ పార్టీ సాస్క్రతిక సైనికుడుగా రమేష్ రాష్ట్ర వ్యాప్తంగా పీడిత ప్రజలందరికీ చిర పరిచయస్తుడు. ఉద్యమ క్రమంలోనే తన సహచరి కుమారిని కోల్పోయాడు. అయినా ఉద్యమమే తన ఊపిరిగా జీవించాడు.
గుంటూరు జననాట్యమండలి బాధ్యుడుగా పని చేసిన ఏసు అలియాస్ సత్యం తొంభై దశకంలో నల్లమల అడవుల్లో జరిగిన చంద్రవంక దిబ్బ ఎన్ కౌంటర్ లో కన్నుమూశారు. దివాకర్ నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో అమరులైనారు.
ఇప్పుడు డప్పు రమేష్ తీవ్రమైన అనారోగ్యంతో గత పదిరోజులుగా విజయవాడ ఆంధ్రా హాస్పటల్ లో చికిత్స పొందుతూ అమరులైనారు.
డప్పు రమేష్ అంత్యక్రియలు విప్లవాభిమానుల సమక్షంలో … 19వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా జూలకల్లు గ్రామంలో జరుగుతాయి.
.