తొట్టంబేడు మండలానికి తహసీల్దారును ఎపుడు నియమిస్తారో తెలియడం లేదు. నెల రోజులుగా రెగ్యులర్ తహసీల్దారు లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బుందులు పడుతున్నారు. భూ సమస్యలు ఎక్కడవక్కడే నిలిచి పోతున్నాయి. రెవిన్యూ కార్యాలయం నుంచి పొందాల్సిన ధృవీకరణ పత్రాల కోసం కూడా దరఖాస్తు దారులు కష్టాలు పడుతున్నారు.
తొట్టంబేడు మండల తహసీల్దారు కార్యాలయం అవినీతికి కేంద్రంగా మారిందనే ఆరోపణలతో ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో తిరుపతి అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేసి.. రికార్డులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అక్రమాలు వెలుగు చూడటంతో తహసీల్దారు పరమేశ్వరస్వామిని సస్పెండ్ చేస్తూ చిత్తూరు కలెక్టరు హరినారాయణన్ మార్చి 7వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ ఛార్జి బాధ్యతలను శ్రీకాళహస్తి తహసీల్దారు జరీనాబేగంకు అప్పగించారు.
అప్పటి నుంచి ఆమె శ్రీకాళహస్తితో పాటు తొట్టంబేడు బాధ్యతలు చూస్తున్నారు. శ్రీకాళహస్తి మండలంలో 45 గ్రామ పంచాయతీలు ఉండటంతో పాటు.. శ్రీకాళహస్తి పట్టణం కూడా ఆమె పరిధిలోకి వస్తుంది. రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద మండలాల్లో శ్రీకాళహస్తి ఒకటి. ఈ మండలంలో పెద్ద మొత్తంలో భూ సమస్యలు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద మండలంలో విధులు నిర్వర్తిస్తూ.. తొట్టంబేడు మండల అదనపు బాధ్యతలు చూసుకోవడం ఆమెకు తలకు మించిన భారంగా మారుతోంది.
ఈ కారణంగా తహసీల్దారు జరీనాబేగం తొట్టంబేడుపై దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. దీనికి తోడు తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయం వర్గ రాజకీయాలకు కేంద్రం కావడంతో ఇక్కడ పని చేయడానికి అధికారులు భయపడుతున్నారు. జరీనాబేగం వర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఏ సమయానికి ఏం జరుగుతుందోనని ఆమె కూడా లోలోన ఆందోళన చెందుతున్నారు.
ఇందుకు కారణం గతంలో ఇక్కడ భూ విషయాల్లో జరిగిన అక్రమాలే కారణం. తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయంలో ఉన్న వర్గ రాజకీయాలతో అధికారులు ఇక్కడకు రావడానికి భయపడుతున్నట్లు సమాచారం. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తిరుపతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది.
శ్రీకాళహస్తిని కూడా రెవిన్యూ డివిజను కేంద్రంగా మార్చారు. తొట్టంబేడుకు మాత్రం తహసీల్దారును నియమించలేదు. తిరుపతి కొత్త కలెక్టరు వెంకటరమణారెడ్డి అయినా చొరవ తీసుకుని తొట్టంబేడుకు రెగ్యులర్ తహసీల్దారును నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు. లేదంటే ఈ మండలంలో భూ సమస్యలు మరింత పేరుకుపోయి రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొత్త కలెక్టరు వెంకటరమణారెడ్డి ఆ దిశగా చర్యలు తీసకుంటారని ఆశిద్దాం.
.