శ్రీకాళహస్తీశ్వర ఆలయ సూపరిటెండెంట్ విజయసారథిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యాదవ
కార్సోరేషన్ డైరెక్టరు లోకేష్ యాదవ్ డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడలో రాష్ట్ర దేవదాయశాఖ కమిషనరు హరి జవహర్ లాల్ ను కలసి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
హైదరాబాదుకు చెందిన కల్పన అనే భక్తురాలు గత నెల 21న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వచ్చారన్నారు. ముక్కంటి ఆలయానికి రూ.1.70లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు వితరణగా ఇస్తామని నాకు ఆమె ముందుగానే తెలియచేయడంతో దర్శనం చేయించడానికి తాను యాదవ కార్పోరేషన్ రాష్ట్ర డైరెక్టరు హోదాలో ఆలయానికి వెళ్లానన్నారు.
ఆ రోజు రాహుకాలం దాటిన తరువాత వెండి ఆభరణాలు వితరణ చేయాలని నిర్ణయించుకుని… మొదట దర్శనం కోసం వెళదామని సదరు భక్తురాలు కోరడంతో తాను తీసుకెళ్లానన్నారు.
స్వామి వారి ఆలయం వద్ద ప్రదక్షిణ చేసిన తరువాత దాత అయిన కల్పనకు అంతరాలయ దర్శనం కల్పించాలని అక్కడే విధుల్లో ఉన్న ఆలయ సూపరిటెండెంట్ విజయసారథికి విజ్ఞప్తి చేశానని తెలిపారు. అయితే ఆయన అందుకు అంగీకరించలేదన్నారు.
హైదరాబాదు నుంచి వచ్చిన దాత అని చెప్పినా అతడు అంగీకరించక పోవడంతో బయట నుంచే దర్శనం చేసుకుని వచ్చినట్లు లోకేష్ యాదవ్ కమిషనరుకు వివరించారు. ఇలా చేయడంతో దాత కల్పన తీవ్ర మానసిక క్షోభకు గురైందన్నారు.
స్వామి, అమ్మవార్ల దర్శనం తరువాత ఈ వెండి ఆభరణాలను గురుదక్షిణామూర్తి సన్నిధిలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు అందజేశామన్నారు.
ఈ సందర్భంగా తనకు జరిగిన అవమానం గురించి ఆలయ ఈవోకు ఫిర్యాదు చేయగా… విజయసారథిని పిలిపించి వారు అడిగారన్నారు. ఈ సందర్భంగా అతడు తనపై రాయలేని భాషలో దూషించడమే కాకుండా… ‘బయటకు రా నీ అంతు చూస్తా’నని బెదిరించారని పేర్కొన్నారు. దాత, ఆలయ ఉద్యోగుల సమక్షంలోనే ఇలా జరగడంతో తాను తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు లోకేష్ యాదవ్ చెప్పారు.
తాను 13ఏళ్లుగా ప్రతి యేటా మహాశివరాత్రికి క్రమం తప్పకుండా ఆలయానికి వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ఉద్యోగి అయి ఉండి… ఆలయంలోనే దాతలను అవమానించడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.
దాతను అవమానం చేయడమే కాకుండా…తన ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఓ పత్రికలో వార్త రాయించారని లోకేష్ యాదవ్ దేవదాయ కమిషనరుకు వివరించారు. విజయసారథిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని… ఇప్పటికే అతడు పలు పర్యాయాలు సస్పెన్షన్ కు గురయ్యారని ఆ సందర్భంగా లోకేష్ యాదవ్ గుర్తు చేశారు. ఆలయంలో దాతలను అవమానిస్తున్న సూపరిటెండెంట్ విజయసారథి వ్యవహారశైలిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇందుకు స్పందించిన దేవదాయశాఖ కమిషనరు హరి జవహర్ లాల్ వెంటనే తిరుపతి ఆర్ జేసీకి ఫోన్ చేశారు. విజయసారధి తీరుపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా తనలాగా ఇతరులకు అవమానం జరగకుండా.. భక్తులను గౌరవించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా లోకేష్ యాదవ్ కమిషనరుకు విజ్ఞప్తి చేశారు.
.