శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పాపులేషన్ స్టడీస్ విభాగం పరిశోధక విద్యార్థి ఎం. ప్రసాద్ కు డాక్టరేట్ ను ప్రధానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎం. దామ్లా నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈయన అదే విభాగానికి చెందిన విశ్రాంత అధ్యాపకులు ఆచార్య కె. రాజశేఖర్ పర్యవేక్షణలో “ఏ స్టడీ ఆన్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ ఫెర్టిలిటి బిహేవియర్ అమాంగ్ వర్కర్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్” అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినందుకు డాక్టరేట్ ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రసాద్ గతంలో ఏఐఎస్ఎఫ్ ఎస్వీయూ క్యాంపస్ అధ్యక్షులుగా, జిల్లా కార్యదర్శిగా విద్యార్థుల సంక్షేమం కోసం పలు ఉద్యమాలు చేసి మంచి నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఒకవైపు విద్యార్థి సమస్యలపై పోరాడుతూ మరోవైపు విద్యాభ్యాసం పై దృష్టి సారించి పీజీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. విశాలాంధ్ర జాతీయ దినపత్రికలో జర్నలిస్ట్ గా సుధీర్ఘ అనుభవం కలిగిన ఆయన పలు కీలకమైన సమస్యలపై కథనాలను ప్రచురించి ప్రజల మన్ననలు పొందడమేకాకుండా ప్రస్తుతం విశాలాంధ్ర జాతీయ దినపత్రిక చిత్తూరు జిల్లా బ్యూరో ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారు.
అలాగే ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. ప్రసాద్ కు డాక్టరేట్ రావడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె. రామకృష్ణ, విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి. హరినాథ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజయ్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ. వి. సుబ్బారావు, విశాలాంధ్ర బ్రాంచ్ మేనేజర్ సుబ్బరాయుడు,
విశాలాంధ్ర దినపత్రిక జర్నలిస్టులు, సిబ్బంది, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఎస్వీయూ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు అభినందనలు తెలియజేశారు.
.