శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు సత్రవాడ మునిరామయ్య, ఆయన తనయులు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్రవాడ ప్రవీణ్ అనుచరులతో కలసి మంగళవారం తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. హైదరాబాదులో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా సత్రవాడ మునిరామయ్య నిజాయితీని కొనియాడుతూ… పాత జ్ఞాపకాలను చంద్రబాబునాయుడు నెమరు వేసుకున్నారు.
మంచి వ్యక్తిత్వం, నిజాయితీ గల నేత మళ్లీ టీడీపీలో చేరడం తనకు ఆనందంగా ఉందన్నారు. మునిరామయ్య తనయులు సత్రవాడ ప్రవీణ్ కు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అందరూ కలసి శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని చంద్రబాబునాయుడు సూచించారు. ‘సత్రవాడ’ కుటుంబం చేరికతో టీడీపీ వర్గాల్లో నూతనోత్తేజం వచ్చింది. తమ కృషి ఫలించినందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సత్రవాడ మునిరామయ్య శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బలమైన వన్నెకుల సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ కులానికి చెందిన వారు శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో అత్యధికంగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు, ఓటమిని శాసించే స్థాయిలో ఈ సామాజిక వర్గం ఉంది. సత్రవాడ మునిరామయ్య 1985లో జరిగిన ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
దాదాపు రెండన్నరేళ్ల పాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఆ తరువాత రాజకీయ సమీకరణలు మారడంతో మునిరామయ్య కొంతకాలం పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే కొంతకాలం తరువాత కుమారుడు సత్రవాడ ప్రవీణ్ వైసీపీలో చేరడంతో మునిరామయ్య కూడా అదే పార్టీలో చేరారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదనరెడ్డి విజయానికి ఎంతో కృషి చేశారు. మునిరామయ్య కుటుంబం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చాలా సన్నిహితంగా ఉండేవారు.
ఈ నేపథ్యంలోనే అధిష్టానం సత్రవాడ ప్రవీణ్ కు వైసీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి పదవితో పాటు…చిత్తూరు పార్లమెంటు బూత్ కమిటీ ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించింది. శ్రీకాళహస్తిలో వైసీపీ కోసం సత్రవాడ ప్రవీణ్ ఎంతో క్రియాశీలకంగా పని చేశారు. అయితే ఏ కారణంగానో ఎన్నికల తరువాత శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి వీరి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్యను కానీ… ఆయన కుమారుడు సత్రవాడ ప్రవీణ్ ను కానీ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించ కుండా అవమానిస్తూ వచ్చారు. సత్రవాడ ప్రవీణ్ కు నామినేటెడ్ పోస్టులు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు.
వారి అనుచరులకు కూడా అధికారులు ఏ పని చేయకుండా చేశారు. నియోజకవర్గంలో ఎంతో బలమైన సామాజివ వర్గానికి చెంది… మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ… స్థానిక వైసీపీ నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో సత్రవాడ కుటుంబం తీవ్ర అసంతృప్తికి లోనయింది. స్థానిక నేతలు చేసే అవమానం భరించ లేక మౌనం పాటిస్తూ వచ్చారు. ఇలా ఉండటంతో వారి అనుచరుల నుంచి ఒత్తిడి పెరిగింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనుచరుల కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనుచరుల ఒత్తిడితో వీరి కుటుంబం ఆలోచనలో పడింది. తగిన సయయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని వేచి చూశారు.

వైసీపీ నేతల తీరు కారణంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, ఆయన తనయులు సత్రవాడ ప్రవీణ్ ను ఇటీవల దివంగత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ, తనయులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వేర్వేరుగా కలసి చర్చించారు. తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. పార్టీలో చేరితే మంచి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అనుచరులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. అనచరులు కూడా టీడీపీలో చేరడానికి అంగీకరించారు. దీంతో టీడీపీలో చేరడానికి అంగీకరించి ఈ విషయం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో చర్చించారు. తమకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో మాట్లాడటానికి అవకాశం కల్పించాలని కోరారు.
ఇందుకు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అంగీకరించారు. ‘సత్రవాడ’ కుటుంబం విషయాన్ని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు సత్రవాడ మునిరామయ్య, ఆయన తనయులు సత్రవాడ ప్రవీణ్ ను హైదరాబాదుకు రావాలని సోమవారం సాయంత్రం వారికి చంద్రబాబునాయుడు కబురు పంపారు. దీంతో వారు తమ అనుచరులతో కలసి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదుకు వెళ్లి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య ఇద్దరూ సుమారు గంట పాటు చర్చించుకున్నారు.
వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మునిరామయ్య సాధారణ జీవితాన్ని… నిజాయితీని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు కొనియాడారు. శ్రీకాళహస్తిలో టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఇందుకు సత్రవాడ మునిరామయ్య, సత్రవాడ ప్రవీణ్ అంగీకరించారు.
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వారిలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు సత్రవాడ ముని రామయ్య, ఆయన తనయులు, సత్రవాడ ప్రవీణ్, వైసీపీ జిల్లా జనరల్ సెక్రెటరీ నాగభూషణం నాయుడు, సత్రవాడ మునిరామయ్య అనుచరులు బిల్లు బాలసుబ్రమణ్యం యాదవ్, న్యాయవాది తులసీరామ్, మునిశేఖర్ గౌడ్, గుణశేఖర్, మురళి యాదవ్, మణీంద్ర, లీలామోహన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు విజయకుమార్, మునిరాజా నాయుడు, రాంబాబు నాయుడు, ధనుంజయ నాయుడు, మల్లిఖార్జున నాయుడు తదితరులు ఉన్నారు.
.