చిత్తూరు జిల్లాలోని 46 మండలాల్లో నూరు మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయింది. జిల్లా వ్యాప్తంగా సగటున 113 మిమీ నమోదు అయింది.
స్వర్ణముఖి నది లో చిక్కుకున్న 17 మంది ని కాపాడిన రెస్క్యూ టీం బృందాలు కాపాడాయి. జిల్లా వ్యాప్తంగా 38 సహాయక శిబిరాల్లో 3178 మంది ఆశ్రయం పొందుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రధానంగా తిరుపతి, పీలేరు, పూతలపట్టు, చిత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి ప్రాంతాల్లో అధిక నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలం అయింది. చిత్తూరు రూరల్ మండలం పెరుమాళ్ కండ్రిగ వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. బంగారుపాలెం మండలం లోని టేకుమంద వద్ద వాగు దాటుతూ ఏడుగురు మహిళలు గల్లంతైనారు. ముగ్గురు మహిళలు సురక్షితంగా బయటపడగ, మరో నలుగురు మహిళల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
గంగాధర నెల్లూరు మండలం దొంగ బంగారెడ్డి పల్లి వాగు వద్ద కొట్టుకు పోతున్న ద్విచక్ర వాహనదారుడిని గ్రామస్తులు కాపాడారు. జిల్లాలో అనేక చోట్ల ప్రధాన రహదారులలో రాకపోకలు బంద్ అయ్యాయి.
గాజులమండ్యం వద్ద తిరుపతి చెన్నై రహదారి, కడప తిరుపతి రహదారిలో ఆంజనేయస్వామి గుడి వద్ద, దెబ్బతినడంతో పోలీసులు రాకపోకలు నిషేధించారు. జిల్లాలోని బహుదా స్వర్ణముఖి, నీవా,, గార్గేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
చిత్తూరు, తిరుపతి పట్టణాలలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. కాలనీలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది.
జిల్లాలోని ప్రధాన జలాశయాలు ఎన్టీఆర్ జలాశయం, కళ్యాణి డాం,అరణియర్ ప్రాజెక్ట్, కృష్ణాపురం రిజర్వాయర్, కాలంగి రిజర్వాయర్, బహుదా ప్రాజెక్టు లలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులు అన్నీ నిండుకుండల్లా కనిపిస్తున్నాయి.
ప్రధాన రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేయడంతో ప్రమాదకరస్థాయిలో జిల్లాలోని నదులు ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షంతో 543 గ్రామాలు జల దిగ్బంధం, 700 గ్రామాలకు రాకపోకలుబంద్,1221 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
160 చెరువులకు గండి 220 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. జలదిగ్బంధంలో పలు విద్యుత్ సబ్ స్టేషన్లు, నేలకొరిగిన కరెంటు స్తంభాలు ఉన్నాయి.
ప్రముఖ కాణిపాక ఆలయంలోకి వరద నీరుచేరుకుంది. వరద నీటిలో చిక్కుకున్న రేణిగుంట మండలం జీవగ్రాం ప్రజలను ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. ప్రధాన నదుల పరివాహక ప్రాంతాల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు సహాయక శిబిరాలకు తరలించారు.
జిల్లా సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ రాజబాబు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక అధికారిగా పీఎస్ ప్రద్యుమ్న ను నియమించారు. వరదనీటితో మునిగిన ప్రాంతాల్లో ప్రత్యేక అధికారి పీఎస్ ప్రద్యుమ్న పర్యటిస్తున్నారు.
.