నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను నగర కమిషనర్ పి.విశ్వనాథ్, తాహసిల్దార్ చిట్టిబాబు, నగరపాలక అధికారులు సోమవారం పరిశీలించారు. ఉదయం ఆరవ వార్డు పరిధిలో చెరువు నీటిలో ముంపుకు గురైన సికె నగర్ కాలనీని సందర్శించారు. కాలనీ వాసులతో మాట్లాడారు.
వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్న… పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల్లో ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తామని అవగాహన కల్పించారు.
అనంతరం గంగా సాగరంలోని శ్రీలంక కాలనీని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడారు. చెరువు నీరు కారణంగా ఇళ్లలోకి నీరు వస్తున్న దృష్ట్యా కాలనీవాసులు ఇతర సురక్షిత ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు.
ఇప్పటికే కొంతమందికి జగనన్న హౌసింగ్ కాలనీలో ఇంటి స్థలాలు కేటాయించామని… అక్కడ ఇల్లు నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు. స్థానికులు తాగునీటి కలుషితంపై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అదనపు కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు.
అంతకుముందు కమిషనర్, ఆర్డిఓ రేణుక కొండారెడ్డిపల్లిలోని గాండ్లపల్లి ఉన్నత పాఠశాలలో సి కె నగర్ వాసుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. పునరావాస కేంద్రం లోని బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ధ్యం లోపం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పనులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైతే బాధితుల కోసం అదనపు గదులను కేటాయించాలని హెచ్ఎంను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంహెచ్వో అనిల్ కుమార్, ఆర్వో గోపాలకృష్ణ వర్మ, ఏసీపీ రామకృష్ణుడు, ఎంఈ నారాయణస్వామి, డీఈ రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.
Discussion about this post