చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన న్రముఖ చిత్రకారుడు… విశ్రాంత ఉపాధ్యాయులు మోహన్ భార్గవ్ (68) వైకుంఠ ఏకాదశి పర్వదినాన గురువారం అస్తమయం చెందారు. మోహన్ భార్గవ్ కు చాలా కాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండేవారు.
ఇటీవల ఆ సమస్య ఎక్కువ కావడంతో మెరుగైన చికిత్స కోసం మూడు నెలల కిందట బెంగళూరుకు వెళ్లారు. అక్కడ తమ సోదరి ఇంట్లో ఉంటూ చికిత్స చేయించుకునే వారు. ఇదిలా ఉండగా మోహన్ భార్గవ్ కు గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధి ఎక్కవైంది.
దీంతో కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కాగా మోహన భార్గవ్ డ్రాయింగ్ ఉపాధ్యాయులుగా తొట్టంబేడు మండలంలోని కన్నలి, శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు, శ్రీకాళహస్తి పట్టణోంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు పలు చోట్ల విధులు నిర్వర్తించారు. ఈయన తన చిత్రకళా నైపుణ్యంతో శ్రీకాళహస్తి ఖ్యాతిని నలుమూలలా చాటారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి యేటా నిర్వహించే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ధూర్జటి కళాప్రాంగణంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించే వారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
మోహన్ భార్గవ్ చిత్ర కళాకారునిగానే కాకుండా సమాజ సేవకులు కూడా. పేద విద్యార్థులకు అండగా నిలిచేవారు. ఈయన జ్ఞాపకాలను శ్రీకాళహస్తి వాసులు నెమరు వేసుకుంటున్నారు.
మోహన్ భార్గవ్ మృతి పట్ల శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ నేత కోలా ఆనంద్, మాజీ ఎంపీపీ బొజ్జల హరినాథ్ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు, వైసీపీ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు, మాజీ ఆప్ డైరెక్టర్ మిద్దెల హరి, టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జయగోపాల్, డాక్టర్ ప్రమీలమ్మ, చిత్ర కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు స్వర్ణ మూర్తి, సభ్యులు గరికపాటి రమేష్ బాబు, ప్రతాప్, దుర్గ, కుమార్ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ఆదర్శిని డాట్ కామ్.. మోహన్ భార్గవ్ మృతికి సంతాపం తెలియజేస్తోంది.
Discussion about this post