జీవిత భాగస్వామి, పిల్లలు, స్నేహితులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటారు. ఈ మూడు రకాల వ్యక్తుల మీద ప్రతి ఒక్కరికీ కొన్ని అంచనాలు, ఆశలు (expectations) ఉంటాయి. వాటికి భిన్నంగా వారు ఉన్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు జీవితంలో ఒడిదుడుకులు పెరుగుతాయి.
ఒక్కో రకం బంధం నిలబడాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. వీటిని ఎంత విశదంగా అయినా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ప్రతి బంధానికీ.. మౌలికంగా, ప్రాథమికంగా ఉండితీరాల్సిన లక్షణం ఒక్కటి ఉంటుంది. అదేమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి.
మూడుబంధాలకూ ఉండాల్సిన అలాంటి ప్రాథమిక లక్షణాలను ఒక సుభాషితం చాలా సరళంగా వివరిస్తుంది.
సా భార్యా యా ప్రియం బ్రూతే స పుత్రో యత్ర నివృతిః
తన్మిత్రం యత్ర విశ్వాసః స దేశో యత్ర జీవ్యతే
ఎవరైతే మధురంగా మాట్లాడుతూ ఉంటారో, మాటలతో నొప్పించకుండా ఉంటారో వాళ్లే నిజమైన భార్య. ఎవరినుంచి అయితే నిజమైన ఆనందం, సంతృప్తి లభిస్తుందో వాళ్లే నిజమైన పిల్లలు. ఎవరినైతే ఎలాంటి సంకోచమూ అనుమానమూ లేకుండా మనం పూర్తిగా విశ్వసిస్తామో వాడే నిజమైన స్నేహితుడు. ఏ నేల మీద అయితే మనకు జీవనోపాధి లభిస్తుందో అదే నిజమైన దేశం. -అనేది శ్లోకభావం.
నలుగురు పిల్లలూ, నలుగురు మిత్రులూ ఉన్నప్పుడు.. వారిలో ‘ఎవరు నిజమైన’ అని తూకం వేయడానికి ఈ సిద్ధాంతం ఉపయోగపడుతుంది గానీ.. భార్య ఒకటే ఉంటుంది కదా.. అనే సందేహం మనకు కలుగుతుంది. కానీ.. అలా వాచ్యార్థం కాదు- ఈ సుభాషితం చెప్పే సూచ్యార్థాన్ని కూడా మనం పరిగణించాలి. భార్య, బిడ్డలు, మిత్రులకు ఈ సుభాషితం చెబుతున్నవి ప్రాథమిక లక్షణాలుగా ఉండాలని మనం గుర్తించాలి.
భార్య అంటే జీవిత భాగస్వామి. జీవితపర్యంతమూ పంచుకున్న వ్యక్తి. అలాంటి భార్య నొప్పించేలా మాట్లాడుతూ ఉంటే.. ఆ జీవితం దుర్భరం అవుతుంది. మిత్రులో, బంధువులో అలా నొప్పించేలా మాట్లాడితే.. జీవితంలో వారినుంచి కొంత దూరం జరిగే అవకాశం ఉంటుంది. కానీ.. భార్య అంటే జీవితంలో భాగం అయిపోయిన తర్వాత.. మాట దుడుకు ఉంటే కష్టం! మాట దుడుకుతునంతో మొదలైన ఇలాంటి వ్యవహారాలు ముదిరి.. ఇవాళ విడాకుల సంఖ్య, సమాజం కోసం తప్ప- తమకోసం తాము మానసికంగా కలిసి ఉండలేని వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది.
ఈ సుభాషితం పురుషుడిని ఉద్దేశించి చెప్పినట్లుగా ఉన్నది గనుక.. భార్యను సూచించింది తప్ప.. ఇదే వాక్యం స్త్రీని ఉద్దేశించి చెప్పుకుంటే భర్తకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం కూడా ఇదే. మధురంగా మాట్లాడడం అంటే.. పొగుడుతూ ఉండడమూ కీర్తించడం మాత్రమే చేయాలని కాదు. లోపాలు చెప్పినాసరే.. వాటిని నొప్పించకుండా చెప్పాలని భావం.
పిల్లలకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం వారు మనకు తృప్తి కలిగించాలి. మనం ఎలాంటి దృష్టితో వారిని చూస్తామో, అంటే సంపదపరంగానా చదువులు పరంగానా వ్యక్తిత్వం పరంగానా, ఆ రకంగా వారు ప్రయోజకులు అయినప్పుడు మాత్రమే సంతృప్తి అనేది కలుగుతుంది. అలాంటి సంతృప్తిని తల్లిదండ్రులకు ఇవ్వడం పిల్లలకుండాల్సిన మౌలిక బాధ్యత.
అలాగే, విశ్వాసం చూరగొనడం ప్రాథమికమైన స్నేహధర్మం. ఎవ్వడైనా సరే.. నీతో ఒక విషయం చెప్పడానికి కాస్త సంకోచించాడంటే, ఆగాడంటే, ఆలోచించాడంటే.. నువ్వు అతడికి స్నేహితుడే కాదని లెక్క! ఇలాంటి సిద్ధాంతం వినగానే.. మన మిత్రుల్లో ఎంతమంది నిజమైన స్నేహితులో మనం బేరీజు వేసుకుంటాం. ఎంతమందిని నిస్సంకోచంగా నమ్మగలమా, దాపరికం లేకుండా మాట్లాడగలమో లెక్కవేసుకుంటాం. మిత్రులందరినీ ఒకసారి స్కాన్ చేసుకుంటాం. ఆ పనికంటె ముందు మరోపని అంతకంటె ముఖ్యంగా చేయాలి. మనల్ని మనం స్కాన్ చేసుకోవాలి. మనమిత్రుల్లో ఎంత మంది మనల్ని పూర్తిగా నమ్ముతున్నారు. ప్రతి విషయాన్ని నిస్సంకోచంగా మనతో పంచుకోగలుగుతున్నారు లెక్కవేసుకోవాలి. అసలైన మిత్రుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు మనలో ఎంత ఉన్నాయో పరీక్షించుకోవాలి. అది ముఖ్యం.
అలాగే ఎక్కడ మనకు బతుకు తెరువు ఉంటుందో అదే మన దేశం. అంటే, రాజ్యం అనేది ప్రజలందరికీ కూడా బతుకు తెరువు చూపించగలిగేలా ఉండాలి.
భార్య/భర్త (జీవిత భాగస్వామిగా), బిడ్డగా, మిత్రుడిగా ఉండే దశ ప్రతిఒక్కరికీ ఉంటుంది. సుభాషితం చెప్పే ఆ లక్షణాలు ఇతరుల్లో ఎంత ఉన్నాయో శోధించకుండా, మనలో ఎంతమేర ఉన్నాయో తెలుసుకోగలిగితే.. జీవితం సుఖప్రదంగా ఉంటుంది.
శుభోదయం
.

Discussion about this post