1945. ఇరవై మూడేళ్ల యువకుడు, సినీ గాయకుడిగా తన భవిష్యత్తును మలచుకోవాలని అనుకుంటున్నవాడు.. అప్పటికే మధుర గాయని, సీనియర్ నటి అయిన భానుమతి పక్కన నిల్చుని తొలి పాట పాడడం అంటే.. చాలా కష్టంతో కూడుకున్న పని! గొంతు పెగలదు. స్వరం సవరించుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది. భయం అనిపిస్తుంది.
అలాంటి కష్టం మధ్య.. భయంభయంగా పాడటం ప్రారంభించిన ఘంటసాల వెంకటేశ్వరరావు.. తర్వాత తన మధుర గానప్రస్థానాన్ని తుదిశ్వాస వరకు ఆపవలసిన అవసరం లేకుండా పోయింది. తుదిశ్వాస అనే పదాన్ని కూడా ఘంటసాలకు వాడకూడదేమో.. ఎందుకంటే ఆయన ప్రతిశ్వాసలోనూ పల్లవించిన గానమాధుర్యం.. మానవాళి బతికి ఉన్నంతవరకూ పరిమళిస్తూనే ఉంటుంది.
పురాణాల్లో ఒక కథ ఉంది. ఒక వ్యక్తి గురించి ఎంతకాలం వరకు జనం గుర్తుంచుకుంటారో.. అంతవరకు ఆ వ్యక్తి జీవించి ఉన్నట్లే అని చెబుతుంది. ఇదే నిజమైతే.. మధురగాయకుడు ఘంటసాలకు ఈ యుగాంతం వరకూ మరణం లేనట్టే. ఆయన భౌతికంగా మనమధ్య లేకుండా ఉండవచ్చుగాక.. కానీ ఆయన మధుర మనోహరంగా గానం చేసిన భగవద్గీత భారతీయులందరికీ సుపరిచితమే. అంతేకాదు. ఆయన గానమాధుర్యం తెలుగు శ్రోతలకు చిరకాలం గుర్తుండిపోతుంది.
తొలి పాట ముచ్చట ఇది..
‘స్వర్గసీమ’లో అప్పటి సీనియర్ నటి, గాయని అయిన భానుమతి సరసన తొలిపాటను భయంభయంగా ప్రారంభించారు. అప్పట్లో భానుమతి, ‘స్వర్గసీమ’లో హీరో పాత్ర చేసిన చిత్తూరు నాగయ్య.. ఇద్దరూ కూడా ‘భయంలేదు పాడ’మంటూ భుజం తట్టి ప్రోత్సహించారు. ఆతర్వాత ఆయన ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.
ఆయన గానవాహిని నుండి జాలువారిన కొన్ని పాటలను గురించి మనం నెమరువేసుకుందాం..
స్వర్గసీమ సినిమాలోని ఆయన తొలిసారి ఆలపించిన పాట ‘రాజా రావో..’ అంటూ భానుమతి ఆలపిస్తే.. ‘‘ఏ వెన్నెల చిరునవ్వుల విరజిమ్ము పఠాణీ’’ అంటూ పాడడం ఆరంభించిన ఘంటసాల తన తొలిపాటతోనే తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాడు.
ఈ పాట సాహిత్యం చూద్దాం..
భానుమతి : ఆ.. రాజా ఓహో నారాజా
ఆహా.. నారాజా రావో.. మారాజా రావో
మారాజా, ఓహోనారాజా..
ఘంటసాల : అరె హో.. ఏ వెన్నెల చిరునవ్వుల విరజిమ్ము పఠాణీ
నీరాకగోరి.. నీదారి కాచియున్నానే
నీకైవేచియున్నానే పిల్ల.. కల్సుకున్నా..
భానుమతి : చాలులే పోరా.. చాలులే పోరా..
మాయలమారీ చాలులే పోరా..చాలులే పోరా..
నాదారి నీజాడ కానగోరి ఏకాకిగానేజారి బేజారైతిరా..
ఘంటసాల : ఓ.. నా చిట్టీచిలక ఎంతలిసిపోతివే అయ్యా
భానుమతి : ఆహా..
ఘంటసాల : నా చిట్టిచిలక ఎంతలిసిపోతివే పిల్ల
భానుమతి : వయ్యారిబావ వగలింక చాలుగాని పోరా
ఘంటసాల : ఆ.. నారాణి
భానుమతి : ఆ.. నా రాజా
ఇద్దరు : పాడుకుందామా జతగా ఆడుకుందామా..
ఇలా సాగుతుంది ఆ పాట..
తొలిపంక్తులే జీవిత సత్యాలైన వేళ..
ఘంటసాల తొలిపాటలో పాడిన తొలిపలుకులు ఏమిటి..? ‘‘ఏ వెన్నెల చిరునవ్వుల విరజిమ్ము పఠాణీ / నీరాకగోరి.. నీదారి కాచియున్నానే / నీకైవేచియున్నానే పిల్ల.. కల్సుకున్నా..’’!
తెలుగుజాతిని ఏలిన గాయకుడి తొలి సినీపాటలో తొలి పంక్తులు ఇవి. ఇంతకూ వెన్నెల చిరునవ్వులను విరజమ్మే ఆ పఠాణీ ఎవరు? తెలుగు సినిమాను, తెలుగు సినిమా గాన ప్రపంచాన్ని ఆ కన్యగా ఊహించుకుని చూశామంటే.. ఆ తొలి పంక్తులు ఎంతో అర్థవంతంగా కనిపిస్తాయి. ‘నీరాక గోరి.. నీ దారి కాచియున్నానే..’ తొలి పాట పాడే అవకాశం కోసం ఆయన దారి కాచి ఉన్నాడు! ‘నీకై వేచి ఉన్నానే పిల్లా కల్సుకున్నా’ .. ఆ అవకాశం కోసం వేచి ఉన్నాడు.. కల్సుకున్నాడు.
ఆ కలుసుకోవడమే తొలి పాట పాడే అవకాశం దక్కించుకోవడం. ఒకసారి కలుసుకున్న తరువాత.. ఆ తెలుగు సినిమా గాన వాహిని ఆయనను అక్కున చేర్చుకుంది. ఆయన మళ్లీ ఆ కౌగిలిలోంచి బయటకు రావాల్సిన అవసరమే లేకుండాపోయింది. తెలుగు పాటతో- ఆయన ప్రణయం.. ఆజన్మాంతమూ సాగింది.
ఈ పాట స్వర్గసీమ చిత్రంలో మనకు వినిపిస్తుంది. ఇది యూట్యూబ్ లో ఇప్పటికీ మనకు వీనులవిందు చేస్తుంది. పాట వింటే మనకు అసలు ఇది పాడింది ఘంటసాలేనా.. అన్న అనుమానం కూడా కలుగుతుంది. కానీ అలాంటి అనుమానాలన్నీ తుడిచేసి చక్కగా ఆ గానం విని ఆస్వాదించండి. మళ్లీ మరో పాటతో కలుసుకుందాం!
పాట వీడియో దిగువ చూడండి :
..ఆరంబాకం అన్నపూర్ణ
ఘంటసాల పాడిన తొలి ప్లేబ్యాక్ పాటను ఈ వీడియోలో వినండి. గుర్తుంచుకోండి.. వింటూ ఉండగా.. ఈ పాట ఘంటసాల పాడారని అంటే.. నమ్మడం కష్టం.
Discussion about this post