గెలుపు సాధించాలంటే శక్తి సామర్థ్యాలు కావాలి.. ఎవ్వరూ కాదనలేని సత్యం ఇది. అయితే శక్తి సామర్థ్యాలు మాత్రమే సరిపోతాయా? బోలెడంత బలం, శక్తి ఇవన్నీ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికీ గెలుపు దక్కుతుందా? కార్యసాఫల్యత సిద్ధిస్తుందా?
పనిలో నెగ్గాలంటే ముందు పని చేయడం అవసరం. పనిగురించి ఆలోచిస్తూ కూర్చున్నంత కాలం పనిలో ఎలా నెగ్గగలం. ఆలోచన అవసరం లేనంత చిన్న మర్మం ఇది. మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. తెలిసిన సంగతి అయినంత మాత్రాన కనీసం మననం చేసుకోకూడదని లేదు కదా.
అదే విషయాన్ని ఈ సుభాషితం కొంచెం కొత్త పోలికలతో చెప్పే ప్రయత్నం చేస్తుంది.
యోజనానాం సహస్రం శనైర్గచ్ఛేత్ పిపీలికా
ఆగచ్ఛన్ వైనతేయోపి పదమేకం న గచ్ఛతి
స్థిరంగా నడుస్తూ వెళుతూ ఉన్నట్లుయితే.. బలహీనమైన చిన్న చీమ కూడా.. కొన్నాళ్లకు మైళ్లకొద్దీ దూరం వెళ్లిపోతుంది. అదే, ఉన్నచోటు నుంచి కదిలే ఉద్దేశం లేకపోతే.. ఎంతో బలవంతమైన గద్ద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లదు. – అనేది శ్లోకభావం.
ముందుకు వెళ్లడం, అభివృద్ధి, పురోగతి ఇలాంటి పదాలు మనం ఎన్నయినా చెప్పవచ్చు గాక.. అవన్నీ.. కేవలం అనుకోవడం ద్వారా సాధ్యం కావు. సంకల్పానికి ప్రయత్నం అవసరం. అతి చిన్న అడుగే అయినా.. ఒక అడుగు ముందుకు వేయడం అవసరం. మన శక్తి సామర్థ్యాలు చాలా తక్కువే అయినా.. స్థిరంగా, మడమ తిప్పకుండా, మధ్యలో కాడి పక్కన పడేయకుండా… ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండడం అవసరం. అలాంటప్పుడు మాత్రమే పురోభివృద్ధి సాధ్యం అవుతుంది.
ప్రగతికోసం ముందుకు సాగాలంటే మన బలహీనతలు అడ్డు కాదు. స్థిర నిశ్చయం, అంతకంటె స్థిరమైన పక్కదారులు పట్టని ప్రయత్నం మాత్రమే ముఖ్యం. కుందేలు- తాబేలు పరుగుపందెం వంటి కథలు మనం చిన్నప్పటినుంచి విన్నాం. ఈ సుభాషితం చెప్పే నీతి కూడా అదే. గద్ద ఎంతటి బలమైనదైనా.. అది ఉన్నచోటునుంచి కదలకుండా ఉంటే ఎక్కడికెళుతుంది. అదే చీమ స్థిరంగా నడుస్తూనే ఉంటేగనుక.. మైళ్లదూరం వెళ్లిపోతుంది.
మనం బతుకు ప్రస్థానంలో చిన్న చిన్న అడుగులే దారితప్పకుండా వేస్తూ ఉంటే చాలా ముందుకు వెళ్లగలం. బద్ధకించకూడదు. అలసత్వం తగదు. అనేదే సుభాషితంలోని మర్మం.
శుభోదయం.
.

Discussion about this post