State of Mind అని అంటూ ఉంటాం. మన మనఃస్థితి ఎలా ఉన్నది? అనేదానిని బట్టి.. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకునే తీరు, స్పందించే తీరు, పరిస్థితులను అవగాహన చేసుకునే తీరు అన్నీ ఆధారపడి ఉంటాయి. మన అంతరంగం కేవలం మనల్ని, మన ఆలోచనల్ని మాత్రమే కాదు.. మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని వాటి పర్యవసానాల్ని కూడా నిర్ణయిస్తుంది.
ఒక సినిమాను ఒకసారి చూసినప్పటికి, మరోసారి చూసినప్పటికీ మన స్పందనలో తేడా వస్తుంది. ఒక పుస్తకాన్ని రెండు సార్లు చదివినప్పుడు రెండు వేర్వేరు రకాల అనుభూతులు కలుగుతాయి. పుస్తకం ఎప్పటికీ అదే.. కానీ మన state of mind ఆ భావనల్ని మారుస్తుంది. ఆ మనఃస్థితిని అదుపులో ఉంచుకోగలిగితే.. సర్వవేళలా ఎలాంటి ఒత్తిడులు, ఆందోళనలు లేని ఒకే రకమైన భావోద్వేగాలతో స్పందనలతో మనం ఉంటాం.
ఆ రకంగా చూసినప్పుడు బాహ్యమైన పరిస్థితులు కాదు, అంతరంగమే మనల్ని నిర్దేశిస్తూ ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ఓ సుభాషితం ఇలా చెబుతుంది.
కాలో వా కారణం రాజ్ఞో రాజా వా కాల కారణం
ఇతి తే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణం
పరిస్థితులను బట్టి రాజు (పాలకుడు) నిర్ణయాలు ఉంటాయా? రాజును బట్టి పరిస్థితులు ఉంటాయా? ఈ మీమాంస అనవసరం. రాజును బట్టి మాత్రమే పరిస్థితులు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -అనేది శ్లోకభావం.
రాజు/పాలకుడు అని ఈ సుభాషితం రాజును- సమాజాన్ని ఉద్దేశించి చెబుతోంది. యథా రాజా తథా ప్రజా అనే మాట కూడా ఇలాంటి భావమే చెబుతుండవచ్చు. సాధారణంగా మనం పరిస్థితుల్ని బట్టి పాలకుడు వ్యవహరిస్తూ ఉంటాడని అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అవుతుంది కూడా. అయితే.. ఈ సుభాషితం ఆ ఆలోచనే తప్పు అని చెబుతుంది. రాజును బట్టి మాత్రమే పరిస్థితులు ఉంటాయని అంటుంది. విశాల దృక్కోణంలోంచి చూసినప్పుడు ఈ వాదనే ఎక్కువ నిజం. ఇందుకు మనకు అనేక దృష్టాంతాలు కనిపిస్తాయి. రాజు/పాలకుడు- పరిస్థితులు ఈ గొడవ మొత్తం కాసేపు మర్చిపోదాం.
ఈ సుభాషితం ప్రతి వ్యక్తి జీవితానికి కూడా అచ్చంగా సరిపోయేది. రాజు అనే పదం సమాజానికి వర్తించేది కావచ్చు. కానీ.. ప్రతి ఒక్కరి జీవితానికి- ఆ వ్యక్తి పాలకుడు! అందుకే ఈ సుభాషితం ప్రవచించే సిద్ధాంతం మనలో ప్రతి ఒక్కరికీ కూడా వర్తిస్తుంది.
‘టైం’ అనే మాట మనం తరచూ వింటూ ఉండేది. టైం బాలేదు.. పరిస్థితులు బాలేవు అందువల్లనే మన జీవితం బాగా లేదు.. అని! టైం బాగోలేకపోవడం వల్ల.. మనం బాలేకపోవడం ఉండదు. మన మీద ఆధారపడే టైం, పరిస్థితులు బాలేకపోవడం ఉంటుంది.
మన చుట్టూ ఉండే పరిస్థితులు ఎప్పుడూ కూడా మనమీదనే ఆధారపడి ఉంటాయి. మనం ఉత్సాహంగా ఉంటే.. మన చుట్టూ పరిసరాల్లో, పరిస్థితుల్లో కూడా ఆ ఉత్సాహం కనిపిస్తుంది. మనం నీరసంగా ఉంటే వాతావరణం కూడా నీరసంగానే అనిపిస్తుంది. అంతఃచైతన్యం మాత్రమే మనల్ని, మన భావాల్ని, ఉద్వేగాల్ని, చుట్టూ ఉండే పరిస్థితుల్ని కూడా శాసిస్తుందని మనం అర్థం చేసుకోవాలి.
శుభోదయం
Discussion about this post